Frauds And Evasions In GST Payments : జీఎస్టీ చెల్లింపునకు సంబంధించి కొందరు వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. పన్ను ఎగవేతకు ఎత్తులు వేస్తున్నారు. కాగితాల్లో కంపెనీలను సృష్టించి మరికొందరు మోసాలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ ఆరునెలలుగా జరిపిన ఆడిట్, తనిఖీల్లో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 13,853 వ్యాపార సంస్థల పేరుతో రూ.2,289 కోట్ల జీఎస్టీ ఎగవేతలు, మోసాలు జరిగినట్లుగా తేలింది.
ఇందులో రాష్ట్ర జీఎస్టీ పద్దు కింద రూ.923 కోట్లు ఉండగా, కేంద్ర జీఎస్టీ కింద రూ.919 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.447 కోట్లు ఉన్నట్లు గుర్తించింది. ఎగవేతదారుల నుంచి ఇప్పటివరకూ రూ.167 కోట్లు వసూలు చేసినట్లుగా వాణిజ్య పన్నులశాఖ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. మిగిలిన సొమ్మును తక్షణమే వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ తరహా మోసాలు : తెలంగాణలోని పలు వ్యాపార సంస్థల్లో బిహార్, యూపీ లాంటి రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి పనులు చేస్తున్నారు. వారికి తెలియకుండా వారి పేర్లతో జీఎస్టీ రిజిస్ట్రేషన్లు చేయించి వ్యాపారాలు చేసినట్లు, జీఎస్టీ కట్టినట్లు బోగస్ పత్రాలు సృష్టిస్తున్నారు. ఇదే ఈ ప్రక్రియలో తొలి అంకం. తదుపరి ఆ ఫేక్ పత్రాలతో జీఎస్టీ రిఫండ్ క్లెయిమ్ చేయడం తదుపరి దశ.
చేతిలో సదరు వ్యక్తి ఆధార్ ఉంటే చాలు జీఎస్టీఐఎన్ పొందడం ఎంతో సులభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపార లావాదేవీలు చాలా ఎక్కువగా ఉంటాయి కనుక అధికారులు ఇలాంటి మోసాలను గుర్తించి చర్యలకు ఉపక్రమించలేరన్నది సూత్రధారుల బలమైన నమ్మకం. ఒకవేళ తదుపరి తనిఖీల్లో అక్రమాలు బయటపడినా అంత సులభంగా తమకు శిక్ష పడదని వారి ధీమా.
సంస్కరణలకు సీఎం ఆదేశం : ప్రధానంగా ఎవరి పేరిట జీఎస్టీఐఎన్ ఉంటే వారి చుట్టూనే కేసు తిరుగుతూ ఉంటుందన్నది వారి విశ్వాసం. ఇదే విషయాన్ని వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి వివరిస్తే ఇలా అక్రమాలకు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపేలా సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో పన్ను వసూళ్లను పెంచడానికి కొత్తగా ఏం చర్యలు చేపట్టాలనే అంశంపై ఈ శాఖ కసరత్తు చేస్తోంది.
Biometric system : అవసరమైతే మొత్తం వాణిజ్య పన్నులశాఖను పునర్‌వ్యవస్థీకరించి తనిఖీల ప్రక్రియను కఠినతరం చేయాలని యోచిస్తున్నట్లుగా సమాచారం. జీఎస్టీఐఎన్ పొందేందుకు ఇప్పటివరకూ కేవలం ఆధార్‌తో ఆన్‌లైన్‌లో పని జరిగిపోతుండగా ఇకపై బయోమెట్రిక్ విధానం తేవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఇందుకోసం సువిధ కేంద్రాలను ఏర్పాటుచేయాలని స్పష్టం చేసింది. అప్పుడు జీఎస్టీఐఎన్ కావాలనుకునే వారు ఈ కేంద్రానికి రావాల్సి ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తి ఆధార్‌ను ఆన్‌లైన్‌లో తనిఖీ చేసి వేలిముద్రలను, ఐరిస్ నమోదు చేసుకొని జీఎస్టీఐఎన్ను కేటాయిస్తారు.
సువిధ కేంద్రాలతో అక్రమాలకు 'కల్లెం' : ఈ సువిధ కేంద్రాలు ఇంకా రాష్ట్రంలో అమల్లోకి రాలేదు. జీఎస్టీ చెల్లింపులు సక్రమంగా జరిగాయా?, లేదా అనేది పక్కాగా తనిఖీ చేస్తున్నట్లు వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ శ్రీదేవి ‘తెలిపారు. కొందరు బోగస్ బిల్లులు, బోగస్ సంస్థలను ఆన్‌లైన్‌లో సృష్టించి సరకులు కొన్నట్లు, అమ్మినట్లు చూపి జీఎస్టీ రిఫండ్ క్లెయిమ్ చేస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించామని, అలాంటివారందరినీ కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపుతామని ఆమె స్పష్టం చేశారు.