Colour Changing Hibiscus Flower in AP : సహజంగా పూలు ఉదయం వికసించి సూర్యుడు వచ్చే సరికల్లా వాడిపోతాయి. కొన్ని పూలు మాత్రం రాత్రి సమయాల్లో పూస్తాయి. కానీ వాటి సహజ గుణం మాత్రం రోజంతా ఒకేలా కనిపిస్తాయి. కానీ ఈ మందార పూలు మాత్రం రంగులు మారుతున్నాయి. ఉదయం ఒకలా, మధ్యాహ్నం మరొకలా, సాయంత్రం ఇంకోలా కనిపిస్తున్నాయి. అదేంటి? మందారం రంగులు మారడం ఏంటీ అని ఆశ్చర్యంగా చూస్తున్నారా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే.
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం గొర్రిబంద గ్రామంలో ఈ రకం మందారం పూస్తుంది. విషయం తెలిసిన జనాలు చూడటానికి వెళ్లి 'ఈ మందారం ఏంటీ ఇలా రంగులు మారుతోంది' అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. గొర్రిబంద గ్రామానికి చెందిన ఎస్.కృష్ణమూర్తి పెరటిలో ఈ మందారం దర్శనం ఇస్తోంది. మందారం జాతి మొక్కకు చెందిన పుష్పాలు ఒకే రోజులో మూడు రంగుల్లోకి మారుతున్నాయి.
అదేలా అంటే, ఉదయం తెలుపు రంగులో, మధ్యాహ్నం అయ్యేసరికి గులాబీ రంగులో, సాయంత్రానికి ఎరుపు రంగులో కనిపించి అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఈ విషయాన్ని రైతు కృష్ణమూర్తిని అడిగితే, ఏడాదిన్నర కిందట ఈ మందారం జాతి మొక్కను ఒడిశా రాష్ట్రం గుణుపురం నుంచి తెచ్చుకున్నామని చెబుతున్నారు.
దక్షిణ చైనాలో పెరిగే మొక్క : ఈ రంగులు మారుతున్న మందారం హైబిస్కస్ మ్యూటాబిలిస్ జాతికి చెందిన పత్తి మందారం మొక్కగా ఉద్యాన శాఖ అధికారిణి మంగమ్మ వివరించారు. ఈ మొక్కలు రంగులు మారుస్తాయని పేర్కొన్నారు. ఇవి దక్షిణ చైనాలో మాత్రమే ఉండేవని, ప్రస్తుతం అన్ని దేశాలకు విస్తరించాయని తెలిపారు. ఈ చైనా మొక్కలు మన ప్రాంతాల్లో కనిపించడం అరుదేనని వెల్లడించారు. ఈ మొక్కలనే డిక్సి రోజ్మల్లౌ, కాన్ఫెడరేట్ రోజ్, కాటన్ రోజ్మల్లౌ, కాటన్రోజ్ పేర్లతోనూ పిలుస్తారని చెప్పారు.
ఒకే మందారం మొక్కకు 20 రకాల పూలు : మరోవైపు ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో మిక్స్డ్ పేరుతో అంట్లు కట్టే విధానాన్ని ప్రారంభించారు. ఒకే మందారం మొక్క నుంచి దాదాపు 20 రకాల పూలు పూసేలా చేస్తున్నారు. మూడు నెలల్లోనే అంటు కట్టిన మందారం మొక్క నుంచి నచ్చిన పూలు వస్తాయయ. మరో రెండు నెలల్లో మందార మొక్కలను కూడా సరఫరా చేస్తామని నిర్వాహకులు తెలిపారు.
ఆశ్చర్యం! - ఒకే మామిడి చెట్టుకు 15 రకాల పండ్లు - మందార మొక్కకు 20 రకాల పూలు