Vote counting to begin from 8 am on June 4: ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పారదర్శకంగా పకడ్భంధిగా నిర్వహించేందుకు కలెక్టర్లు, ఎస్పీలు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 4 నుంచి ప్రారంభమైయ్యే కౌంటింగ్‌కు అన్ని చర్యలు తీసుకున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లిరావు చెప్పారు. కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి ఆయన విజయవాడలో మీడియా సమావేశాల్లో మాట్లాడారు. పార్లమెంట్ ,అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 14 టెబుల్స్ చొప్పున ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభిస్తామని ,ఈవీఎంల లెక్కింపు ఉదయం 8గంటల 30 నిమిషాల నుంచి ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో గరిష్టంగా 22 రౌండ్ల పాటు,కనిష్టంగా 16 రౌండ్ల పాటు లెక్కింపు చేయనున్నట్లు వెల్లడించారు. సాయంత్రం 6 గంటలలోపు ఎన్నికల ఫలితాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు కలెక్టర్ చెప్పారు. కౌంటింగ్ హాజరు అయ్యే ఏజెంట్లు మొబైల్ ఫోన్లు తమ వెంట తీసుకురావద్దని కలెక్టర్ సూచించారు.
పల్నాడు జిల్లా ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లను అధికారులు సర్వం సిద్ధం చేశారు. నరసరావుపేట సమీపంలో కాకాని వద్ద ఉన్న JNTUలో ఈ నెల 4న కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 14 చొప్పున టెబుళ్లు ఏర్పాటు చేశారు. మెుత్తం 700 మంది సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనున్నారు. జిల్లాలో తొలి ఫలితం చిలకలూరిపేట నుంచి వెలువడే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గురజాల నియోజకవర్గం నుంచి తుది ఫలితం వెల్లడి కానుంది. కౌంటింగ్ రోజు దాడులు, అల్లర్లు, ఘర్షణలు జరగకుండా పోలీసులు పటిష్ఠమైన భద్రత ఏర్పాట్లు చేశామని తెలిపారు.
ఈ నెల 4న కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఓట్ల లెక్కింపు జరగనుందని అన్నమయ్య జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ వెల్లడించారు. రాయచోటిలోని సాయి ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఓట్ల లెక్కింపు కోసం సిబ్బందికి శిక్షణ ఇచ్చామని అన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి పెన్ను, పేపరు మినహా వేటిని అనుమతించమని స్పష్టం చేశారు. ఈ నెల 4న ఉదయం ఎనిమిది గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తామని అన్నారు. అన్ని పార్టీల ఏజెంట్లు ఉదయం 6 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. జిల్లాలో ఈ నెల 6 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు.
ఎగ్జిట్ పోల్స్ - ఏపీలో ఏ పార్టీకి ఎన్ని లోక్‌సభ స్థానాలంటే! - Lok Sabha Exit Polls Result 2024
కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు వివాదరహితులైన ఏజెంట్లను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఈ నెల 4న తాడికొండ నియోజకవర్గం ఎన్నికల ఫలితం ముందుగా వెలువడనుందని తెలియజేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా మూడంచెల పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ పేర్కొన్నారు. చిలకపాలెం సమీపంలో ఉన్న శ్రీ శివాణి ఇంజనీరింగ్ కళాశాలలో కౌటింగ్ ప్రక్రియ ఉంటుందని తెలిపారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు తర్వాత ఈవీఎంల లెక్కింపు మొదలు పెడతామన్నారు. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల నుంచి 86 మంది పోటీలో ఉన్నారని వెల్లడించారు. తొలి ఫలితం ఆమదాలవలస వచ్చే అవకాశం ఉందన్నారు.