Cognizant Announces New Centre Expansion in Hyderabad : ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ హైదరాబాద్‌లో భారీ విస్తరణకు ముందుకొచ్చింది. సుమారు 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా దాదాపు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్‌లో కొత్త సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం న్యూయార్క్‌లో కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ బృందంతో సమావేశమైంది. గతేడాది ముఖ్యమంత్రి బృందం దావోస్ పర్యటన సందర్భంగానే ఈ ఒప్పందంపై ప్రాథమిక చర్చలు జరిగాయి.
ఐటీ సేవలను విస్తరించేలా : ఐటీ రంగానికి మరింత అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కాగ్నిజెంట్ కంపెనీ కొత్త సెంటర్ ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్‌ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయని అభిప్రాయపడ్డారు. కాగ్నిజెంట్ కొత్త సెంటర్‌తో వేలాది మంది యువతకు ఉద్యోగాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుందని సీఎం అన్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలలో కూడా ఐటీ సేవలను విస్తరించాలని ముఖ్యమంత్రి సూచించగా, కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.
సాంకేతికత, కొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా సత్తా చాటుకుంటున్న హైదరాబాద్‌లో తమ కంపెనీ విస్తరించటం సంతోషంగా ఉందని కాగ్నిజెంట్ సీఈవో ఎస్.రవికుమార్ అన్నారు. హైదరాబాద్‌లో నెలకొల్పే కొత్త సెంటర్ ప్రపంచవ్యాప్తంగా తమ క్లయింట్లకు మెరుగైన సేవలందించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఐటీ సేవలతో పాటు కన్సల్టింగ్‌లో అత్యాధునిక పరిష్కారాలను అందిస్తుందని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్‌తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని కాగ్నిజెంట్ సీఈవో తెలిపారు.
Telangana Chief Minister Revanth Reddy garu concludes huge expansion agreement with global major Cognizant.
— Telangana Congress (@INCTelangana) August 5, 2024
HIGHLIGHTS
• Cognizant agrees and announces significant expansion plans
• Will create new facility in Hyderabad – with over 1 million SFT space
• Move will create over… pic.twitter.com/ecdqkiOffQ
తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు : ఇదిలా ఉండగా అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు జన్మభూమి అభివృద్ధికి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. అమెరికాలో స్థిరపడి ఆ దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడిన వారు, తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్, తెలంగాణలో మెట్రో, సెమీ అర్బన్, రూరల్ అనే మూడు వలయాల ప్రాతిపదికగా అభివృద్ధికి చర్యలు చేపట్టామని, అందుకు సహకారాన్ని అందించాలని కోరారు.
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ సరసన ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకోబోతోందని, ఈ సిటీలో ప్రవాసుల పెట్టుబడుల ఆవశ్యకత ఉందని సీఎం రేవంత్ చెప్పారు. తెలంగాణలో పెట్టే ప్రతి రూపాయికి ఎన్నోరెట్లు ప్రయోజనం చేకూరుతుందన్న సీఎం, ఈ విషయంలో తనదే గ్యారెంటీ అని చెప్పారు. సొంత దేశంలో పెట్టుబడులు పెట్టి తగిన అభివృద్ధి సాధిస్తే, అది ఎంతో తృప్తినిస్తుందనే విషయాన్ని గ్రహించాలని ముఖ్యమంత్రి ప్రవాస భారతీయులకు సూచించారు. తెలంగాణలో సాఫ్ట్‌వేర్, ఫార్మా, హెల్త్ కేర్, ఫ్యూచర్ టెక్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని వివరించారు.
స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా : సీఎం రేవంత్ - Young India Skill University