Coconuts Prices Increased in Konaseema Market : ఇంట్లో నిత్యం పూజలు మొదలు ఏ చిన్న పండగొచ్చినా, ఇంట్లో ఏ శుభకార్యమైనా కొబ్బరికాయ కొట్టాల్సిందే. అలా గుడికి వెళ్లొద్దామన్నా, ఏ మంచి పనైనా మొదలుపెడదామన్నా కాయ లేనిదే పని జరగదు. అలాంటి కొబ్బరికాయ ధరలూ ప్రస్తుతం రెట్టింపయ్యాయి. మొన్నటి వరకు రూ.20 నుంచి రూ.25కు దొరికిన టెంకాయ, ఇప్పుడు దాదాపు రెట్టింపు రేటు పలుకుతోంది. దసరా, దీపావళి పండుగల నాటికి ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
సాధారణంగా మనకు కొబ్బరికాయలు ఆంధ్రప్రదేశ్ నుంచి దిగుమతి అవుతుంటాయి. తాజాగా ఏపీలోని కోనసీమ మార్కెట్‌లో కొబ్బరికాయల ధర రికార్డు స్థాయికి చేరింది. సగటున 1000 కొబ్బరికాయల ధర నెల రోజుల వ్యవధిలోనే రూ.9000 నుంచి రెట్టింపై రూ.18000 చేరింది. త్వరలోనే దసరా, దీపావళి పర్వదినాలు ఉన్నందున అప్పటికి ఈ రేటు రూ.20 వేలకు చేరొచ్చని రైతులు, వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. దాదాపు 5 సంవత్సరాల తర్వాత కొబ్బరి ఈ రేటు పలికిందని, పొరుగు రాష్ట్రాలు కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లో వేర్వేరు కారణాల వల్ల కొబ్బరికాయల దిగుబడులు తగ్గడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.
కొబ్బరి ఉత్పత్తులూ తగ్గేదే లే : కేవలం కొబ్బరికాయల ధరలు పెరగడమే కాదు కొబ్బరి ఆధారిత ఉత్పత్తులపైనా ఆ ప్రభావం పడిందని వ్యాపారులు చెబుతున్నారు. కొబ్బరి నూనె (కిలో రూ.320), వర్జిన్ కోకోనట్ ఆయిల్ (కిలో రూ.500), ఎండు కొబ్బరి (క్వింటాల్ రూ.15,500) ధరలూ పెరిగాయని, కొత్త కొబ్బరి, పచ్చి కొబ్బరి కాయలు, కురిడీ కొబ్బరి కాయల ధరలు కూడా రైతుకు ఆశాజనకంగానే ఉన్నాయని అంటున్నారు. పెరిగిన ధరలు పండించే రైతన్నకు లాభాలను చేకూరుస్తున్నా, వినియోగదారులకు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి!. (కొబ్బరికాయలను ఏపీలోని కోనసీమ నుంచి హైదరాబాద్‌కు రవాణా చేసేందుకు లారీ కిరాయి రూ.25,000 నుంచి రూ.35,000 వరకు ఉంటుంది. అంటే ఒక్కో కాయ రవాణాకు రూ.1 నుంచి 1.50 వరకు పడుతుందని వ్యాపారులు చెబుతున్నారు.)
ధరలు పెరగడానికి కారణాలివే : పచ్చి కొబ్బరికాయలు తెలుగు రాష్ట్రాలతో పాటు ముంబయి, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు, కురిడీ కొబ్బరి కాయలు మహారాష్ట్ర, దిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హరియాణా రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి.ఉత్తరప్రదేశ్, బిహార్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాల వర్తకులూ కొబ్బరికాయలు కొనుగోలు చేసేందుకు ఏపీకి వస్తున్నారు. దీనిని బట్టి కొబ్బరికాయలకు డిమాండ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
నిత్యావసర సరకుల ధరలు పైపైకి - దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో - ESSENTIALS RATES HIKE IN TELANGANA