CM Revanth Visited Flood Effected Areas in Khammam : ఖమ్మం జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాణ, ఆస్తి నష్టానికి ఆర్థిక సాయం ప్రకటించారు. పాడిపశువులు, గొర్రెలు, మేకలు నష్టపోయిన వారికి ఆర్థికసాయం చేయనున్నట్లు తెలిపారు. వరదల్లో ధ్రువపత్రాలు పోగొట్టుకున్న వారికి మళ్లీ ఒరిజినల్స్ ఇస్తామని వెల్లడించారు. రెవెన్యూ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశాలు జారీ చేశారు.
నష్టం అంచనా నివేదిక ఆధారంగా పరిహారం అందిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. వరద బాధితులకు రూ.10 వేలు తక్షణ సాయం ప్రకటించారు. వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం, పాడిపశువులు కోల్పోయిన వారికి రూ.50 వేలు, గొర్రెలు, మేకలు కోల్పోయిన వారికి రూ.5 వేలు, ఇళ్లు కోల్పోయిన వారికి ప్రధాని ఆవాస్ యోజన కింద ఆర్థిక సాయం చేయనున్నట్లు చెప్పారు.
"ఇది చాలా బాధాకరమైన సందర్భం. వరద మీ బతుకుల్లో విషాదాన్ని తెచ్చిపెట్టింది. మంత్రులు, అధికారులు నిరంతరం మీకోసం కష్టపడుతున్నారు. మంత్రి పొంగులేటి నిద్ర లేకుండా సమీక్షిస్తున్నారు. రీటైనింగ్‌వాల్‌తో వరదను నిలువరించవచ్చని నిర్మాణాన్ని ప్రారంభించాం. రీటైనింగ్‌వాల్ పూర్తి కాకముందే వరదలు వచ్చాయి. 70 ఏళ్లలో 40 సెం.మీ. వర్షాన్ని చూడలేదు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే రాజీవ్ గృహకల్పను వైఎస్ తెచ్చారు. రాజీవ్ గృహకల్పలో నివసిస్తున్న పేదలు నష్టపోయారు. ప్రతి కుటుంబానికీ నిత్యావసరాలు అందించాలని ఆదేశించాను." - సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించే ముందు సీఎం రేవంత్ పాలేరు రిజర్వాయర్‌ను పరిశీలించారు. కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ వద్ద ఎన్ఎస్పీ కాలువకు గండి పడటంతో పొలాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో ఆయన పంట పొలాలను పరిశీలించారు. అలాగే వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన సాగర్ ఎడమ కాలువ, నాయకన్‌గూడెం దగ్గర దెబ్బతిన్న రోడ్డు, పాలేరు ఏరును మంత్రులతో కలిసి పరిశీలించిన అనంతరం ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారు. రోడ్డు మార్గంలో వరద ప్రభావిత ప్రాంతాలకు సీఎం చేరుకున్నారు. సీఎం వెంట ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ రఘురాంరెడ్డి ఉన్నారు.