CM Revanth Review on New Telangana Song Today : తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన తుది దశకు చేరుకుంది. జయ జయహే తెలంగాణ గీతం రూపకల్పనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, పలువురు పాల్గొన్నారు. ఈ సమీక్షలో రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీతాన్ని సంగీత దర్శకుడు కీరవాణి బృందం పాడి వినిపించింది.
గీతం నిడివి, స్వరకల్పన, గాయకులని ఖరారుచేశారు. మార్పులు, చేర్పులని కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి వివరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్రూతలూగించిన అందెశ్రీ గీతం ‘జయ జయహే తెలంగాణ’ని ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ప్రకటించగా, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరకల్పన చేశారు.
అయితే ఇందుకు తగిన సమాచారం ఎక్కడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లను చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర గేయం, చిహ్నంలో చిన్న చిన్న మార్పులు చేయనుంది. ఈ మార్పుల తర్వాత జూన్ 2న నూతనంగా ఆవిష్కరించనున్నారు.
రాష్ట్ర చిహ్నంపై తుదిరూపు సిద్ధం : అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుదిరూపు సిద్ధమైంది. పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కళాకారుడు రుద్ర రాజేశం రూపొందించిన చిహ్నంపై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత చిహ్నంలో రాచరికం గుర్తులు ఉన్నందున ప్రజాస్వామ్యం, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా కొత్తగా తయారు చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొత్త చిహ్నం కోసం 12 నమూనాలు తయారు చేయించారు. కొత్త చిహ్నంపై ఇటీవల సీపీఐ, సీపీఎం నేతలతో పాటు ఉద్యమకారులు, పార్టీ నేతలు, కొందరు అధికారులతో సీఎం చర్చించారు.
ప్రస్తుత చిహ్నంలోని కాకతీయ తోరణాన్ని తొలగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అంతర్జాతీయ గుర్తింపు ఉన్న చార్మినార్, మూడు సింహాలు, జాతీయ జెండాలోని మూడు రంగులను కొనసాగిస్తూనే పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా మరో గుర్తు పెట్టాలని కొన్ని రోజులుగా పలువురు సూచించినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం రుద్ర రాజేశంతో సీఎం చర్చించి కొన్ని మార్పులను సూచించారు. నేడు తుది రూపంపై సీఎం సమీక్షలో రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు.