CM Revanth Review on Revenue Mobilization and Resources : పన్ను వసూళ్లలో నిర్దేశించిన వార్షిక లక్ష్యాన్ని అన్ని శాఖలు సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇవాళ ఆదాయార్జన శాఖల అధికారులతో సీఎం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. వాణిజ్య పన్నులు, ఆబ్కారీ, రిజిస్ట్రేషన్లు, రవాణా, గనులు, భూగర్భ వనరుల శాఖ పన్ను వసూళ్లపై సమీక్షించిన ముఖ్యమంత్రి, ఆర్ధిక సంవత్సరాల వారీగా ఆదాయ సేకరణ, పన్నుల వసూళ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాణిజ్య పన్నుల శాఖలో పన్ను లక్ష్యానికి, రాబడికి మధ్య వ్యత్యాసం ఎందుకుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నిరుటి వరకు జీఎస్టీ(GST) పరిహారం కింద నాలుగు వేల కోట్లకు పైగా చెల్లించిందని, గడువు ముగిసి ఆ నిధులు రాకపోవడంతో రాబడిలో వ్యత్యాసం నిపిస్తోందని అధికారులు వివరించారు.
వాణిజ్య పన్నుల శాఖలో నిర్దేశించిన టార్గెట్ పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పొరుగు రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోవాలని ఆదేశించారు. మద్యం సరఫరా, విక్రయాలకు సంబంధించిన లెక్కల్లో తేడాలు ఉంటున్నాయని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రతి డిస్టిలరీ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానించాలని, మద్యం సరఫరా వాహనాలకు జీపీఎస్(GPS) అమర్చి ట్రాకింగ్ చేయాలని చెప్పారు. మద్యం సరఫరా వాహనాలకు వే బిల్లులు కచ్చితంగా ఉండాలన్న రేవంత్ రెడ్డి, బాటిల్ ట్రాకింగ్ ఉండేలా తయారీ సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
CM Revanth About Income Department Building : నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్‌తో పాటు గతంలో నమోదు చేసిన పలు కేసుల పురోగతిపై నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎక్సైజ్(Excise) విభాగంలో అక్రమాలను అరికట్టి పూర్తి స్థాయిలో పన్ను వసూళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆదాయాన్ని తెచ్చే శాఖలకు సొంత భవనాలు లేకపోవడం సరికాదన్న సీఎం, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా నూతన భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ప్రస్తుతానికి ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలు వినియోగించుకోవాలని సూచించారు. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో రహదారులపై కంకర కుప్పలుగా పోసి విక్రయిస్తున్నారని, అలా కాకుండా నగరంలోని వివిధ ప్రదేశాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలను వినియోగించాలని పేర్కొన్నారు.
ఇసుక విక్రయాలపై సమగ్ర విధానం రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వే బిల్లులతో పాటు ఇసుక సరఫరా వాహనాలకు ట్రాకింగ్ ఉండాలన్న ఆయన, అక్రమ రవాణాకు అవకాశం ఇవ్వవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు గతంలో విధించిన జరిమానాలు వెంటనే వసూలు చేయాలని ఆదేశించారు. గతంలో జరిమానాలు విధించి తర్వాత ఎందుకు తగ్గించారో, కారణాలతో కూడిన నివేదిక సమర్పించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. టీఎస్ ఎండీసీతో పాటు గనుల శాఖలో పలువురు అధికారులు ఒకే పోస్టులో ఏళ్ల తరబడి తిష్ట వేశారని, కొందరిపై ఆరోపణలున్నాయన్న సీఎం, వారిని వెంటనే బదిలీ చేయాలని ఆదేశించారు.
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆర్టీసీలో 100 శాతం దాటుతోన్న ఆక్యుపెన్సీ - రిపేర్ల కోసం షెడ్లకు క్యూ కడుతోన్న బస్సులు