CM Revanth Reddy to Visit Warangal Today : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓరుగల్లు పర్యటనకు బయలుదేరారు. దిల్లీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్న సీఎం, హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్లో వరంగల్ పర్యటనకు బయలుదేరారు. సీఎంకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధమయ్యారు. నగరంలో సీఎం పర్యటించే మార్గంలో అడుగడుగునా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ మధ్యాహ్నం 1.30 గంటలకు వరంగల్‌కు చేరుకోనున్న సీఎం, గీసుకొండ మండలంలో మెగా టెక్స్ టైల్ పార్క్‌ను సందర్శించనున్నారు. పార్క్ పనుల పురోగతిని సమీక్షిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు. అనంతరం 24 అంతస్తుల్లో నిర్మితమవుతున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించనున్నారు.
CM Revanth to start Mahila Shakti canteen in Warangal : ఆసుపత్రి సందర్శన ముగించుకుని హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో మహిళా శక్తి క్యాంటీన్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం రెండున్నర గంటల సేపు గ్రేటర్ వరంగల్ పరిధిలో అభివృద్ధి పనులపై సమీక్షిస్తారు. నగరంలో భూగర్భ డ్రైనేజీ, మామ్ నూరు విమానాశ్రయ పునరుద్ధరణ, స్మార్ట్ సిటీ పథకం తదితర పనులపై సమీక్ష జరపనున్నారు. హంటర్ రోడ్‌లో నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించి సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్ బయలుదేరి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు.
పరకాల డివిజన్ రైతులు ముందస్తు అరెస్టు : వరంగల్‌లో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో హనుమకొండ జిల్లా పరకాల డివిజన్‌లోని గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూ నిర్వాసిత రైతులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టు పట్ల భూ నిర్వాసిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమిపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతులను పోలీసు స్టేషన్ చుట్టూ తిప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
దిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు సీఎం : దిల్లీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి నేడు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఐదు రోజుల పాటు దిల్లీలో పర్యటించిన సీఎం, రాష్ట్రాభివృద్ధికి సాయం కోసం కేంద్రమంత్రులను కలిశారు. కొత్త పీసీసీ నియామకం, మంత్రివర్గ విస్తరణ, చేరికలపై అధిష్ఠానంతో చర్చలు జరిపారు.
త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ - కేబినెట్లోకి ఆ నలుగురు? - Telangana Cabinet Expansion