CM Revanth Reddy Warangal Tour : ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. హెలికాప్టర్‌లో గీసుకొండ మండలం శాయంపేటకు చేరుకున్న సీఎంకు మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పార్టీశ్రేణులు ఘన స్వాగతం పలికారు. టెక్స్‌టైల్ పార్క్ నిర్మాణ పురోగతిని ముఖ్యమంత్రి పరిశీలించారు. నిర్మాణాలు ఎక్కడి దాకా వచ్చాయో అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ఇంకా చేపట్టాల్సిన పనులపై మంత్రులు, అధికారులకు పలు సూచనలు చేశారు. వనమహోత్సవంలో భాగంగా మెగా టెక్స్‌టైల్ పార్కులో సీఎం రేవంత్ రెడ్డి మొక్కలు నాటారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అధికారులు ఉన్నారు.
అనంతరం మెగా టెక్స్‌టైల్ పార్కులో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కైటెక్స్, యంగ్‌వన్ సంస్థల ప్రతినిధులతో సీఎం మాట్లాడారు. టెక్స్‌టైల్ పార్క్ ప్రాంతాన్ని ప్రత్యేక జోన్‌గా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. టెక్స్‌టైల్ కోసం భూములు ఇచ్చిన వారికి ఇందిరమ్మ ఇళ్లు అందించేలా కృషి చేస్తామన్నారు. టెక్స్‌టైల్ పార్కు సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
సూపర్ స్పెషాలిటీ భవన నిర్మాణం పరిశీలన : ఈ సమావేశం ముగిసిన తర్వాత టెక్స్‌టైల్ పార్క్ నుంచి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి బయలుదేరి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. అక్కడకు చేరుకున్న తర్వాత ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని సీఎం పరిశీలించారు. వరంగల్‌లో 24 అంతస్తుల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం ఎప్పుడో తెలిపింది. అక్కడి నుంచి హనుమకొండలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అక్కడ ఆహారాన్ని మంత్రులతో కలిసి రుచి చూశారు. అక్కడ మహిళలతో కాసేపు ముచ్చటించారు.
గ్రేటర్ వరంగల్ అభివృద్ధి పనులపై సమీక్ష : మహిళా క్యాంటీన్‌ను ప్రారంభించిన అనంతరం గ్రేటర్ వరంగల్ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. హనుమకొండ కలెక్టరేట్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. నగరంలో భూగర్భ డ్రైనేజీ, స్మార్ట్ సిటీ పథకంపై అధికారులకు సీఎం సూచనలు చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కాళోజీ కళాక్షేత్రం నిర్మాణంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు.