CM Revanth Common Diet : 'ఇటీవలే గురుకులాల డైట్ ఛార్జీలు పెంచాం. గురుకులాల బాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు గురుకులాల విద్యార్థుల కంటే ఎక్కువనే భావన ఉంది. గురుకులాలు అంటే బహుముఖ ప్రతిభకు కేంద్రాలు అనే గుర్తింపు తీసుకురావాలి. గురుకులాల వ్యవస్థను పీవీ నరసింహారావు హయాంలో తీసుకొచ్చారు. టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం ఒకప్పటి గురుకుల విద్యార్థే. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి కూడా గురుకులాల విద్యార్థే. గురుకులాల విద్యార్థులు ఎందరో ఉన్నతస్థాయికి వెళ్లారు.' అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరులో గురుకుల పాఠశాలను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. అనంతరం గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో కామన్ డైట్‌ను ప్రారంభించారు.
గురుకులాల ప్రక్షాళన కోసం ప్రభుత్వం సిద్ధం : ప్రైవేట్ స్కూళ్లు వచ్చాక కొంతవరకు గురుకులాల ప్రభావం తగ్గిందని సీఎం అన్నారు. గురుకులాల ప్రక్షాళన కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లుగా బీఆర్ఎస్ సర్కారు డైట్ ఛార్జీలు పెంచలేదని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక గురుకులాల డైట్ ఛార్జీలు పెంచామని పేర్కొన్నారు. 40 శాతం డైట్ ఛార్జీలు, 200 శాతం కాస్మోటిక్ ఛార్జీలు పెంచడం చరిత్ర అని సీఎం అన్నారు. 16 ఏళ్లలో ఒక్కసారైనా కాస్మోటిక్ ఛార్జీలు పెంచలేదని మండిపడ్డారు.
ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలల్లో ఎక్కువ మంది చదువుతున్నారని సీఎం తెలిపారు. డైట్ ఛార్జీలు పెంచి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నామన్నారు. విద్యార్థులపై పెడుతున్న పెట్టుబడి ఖర్చు కాదని, భవిష్యత్తులో పునర్ నిర్మాణం కోసం పెట్టే ఖర్చు అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. గురుకులాల్లో మార్పులు తీసుకు వస్తున్నామని, ఇక్కడి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని సీఎం తెలిపారు.
"ఆర్థిక ఇబ్బందుల వల్ల పిల్లలను హాస్టళ్లలో పెడుతున్నారు. మనల్ని నమ్మి తల్లిదండ్రులు పిల్లలను గురుకులాల్లో పెడుతున్నారు. విద్యార్థుల మృతిపై మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం, సిబ్బందిపై ఉంది. గతంలో డైట్ విషయంలో బిల్లులు రాలేదని నాణ్యత తగ్గిస్తున్నామని చర్చలు వస్తున్నాయి. ప్రతి నెల 10లోపు గ్రీన్‌ఛానల్ ద్వారా అన్ని విద్యాసంస్థలకు సంబంధించిన నిధులు వస్తాయి. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో ఉచితంగా కరెంట్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాం. ప్రతి రోజు అధికారులు డైట్ తిని, నాణ్యత చూడాలని సూచించాం." - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
స్కిల్ వర్సిటీ దేశానికే ఆదర్శం : 75 ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఐటీఐల్లో చేరితే కచ్చితంగా ఉద్యోగం వస్తుందని అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. రంగారెడ్డి జిల్లాలోనే యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ ఉందని గుర్తు చేశారు. స్కిల్స్ వర్సిటీ దేశానికే ఆదర్శమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. చిన్నారులతో సీఎం రేవంత్ రెడ్డి కాసేపు ముచ్చటించి, మధ్యాహ్న భోజనం వారితో కలిసి చేశారు.