CM Revanth said Health Cards for all People of Telangana : పూర్తి హెల్త్ ప్రొఫైల్‌తో రాష్ట్రంలో ప్రజలందరికీ హెల్త్ కార్డులు ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సెప్టెంబరు 17 నుంచి 10 రోజుల పాటు రెండో విడత ప్రజా పాలన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాలు సేకరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డుల జారీకి అర్హతలు, విధి విధానాల కోసం ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు అయింది.
మరోవైపు రాష్ట్ర ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్య వివరాలతో కూడిన హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డులతో పాటు హెల్త్ కార్డుల జారీ కోసం అవసరమైన వివరాలు సేకరించేందుకు సెప్టెంబరు 17 నుంచి 10 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. క్షేత్రస్థాయిలో సిబ్బందిని సన్నద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు మొదటిసారి నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీ పథకాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి.
భవిష్యత్తు కోసం రోడ్లు అనుసంధానానికి ప్రణాళిక : గోషామహల్లో నిర్మించ తలపెట్టిన కొత్త ఉస్మానియా ఆసుపత్రిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రానున్న 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం కోసం భూ బదలాయింపు ప్రక్రియ, డిజైన్లు, ఇతర ప్రణాళికలను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రోడ్ల అనుసంధానికి ప్రణాళికలు చేయాలని చెప్పారు. గోషామహల్‌లోని సిటీ పోలీస్ అకాడమీకి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
'స్పీడ్'పై సీఎం సమీక్ష : అలాగే ఆరోగ్య, మున్సిపల్ శాఖలకు సంబంధించి స్పీడ్ (స్మార్ట్ ప్రొయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ)పై సచివాలయంలో సమీక్ష జరిగింది. ఆయా శాఖల్లో అత్యవసర, ప్రాధాన్యత కలిగిన పనులను గుర్తించి వాటిపై సమీక్ష, తక్షణ నిర్ణయాలు చేయడమే స్పీడ్ ఉద్దేశం. సచివాలయంలో వైద్యారోగ్య శాఖ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇతర అధికారులు పాల్గొన్నారు.