CM Revanth Reddy Chit Chat With Media in Delhi : రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షాలను కోరినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. కేంద్ర, రాష్ట్రాలు సత్సంబంధాలు కొనసాగించాలన్న ఆలోచనతోనే కలిశామని వారు కూడా సానుకూలంగా స్పందించారన్నారు. దిల్లీలోని తన అధికార నివాసంలో విలేకర్లతో సీఎం రేవంత్‌రెడ్డి ఇష్ఠాగోష్ఠిలో మాట్లాడారు. గత కేసీఆర్ ప్రభుత్వం కేంద్రంతో ఘర్షణ వైఖరి అనుసరించడం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందన్నారు.
కాళేశ్వరం, మిషన్‌భగీరథ, మిషన్ కాకతీయ తప్ప ప్రజలకు మరేమీ గుర్తుకు రాకూడదనే ఉద్దేశంతో కేంద్ర పథకాలను పక్కనపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతిష్ఠ పెంచుకోవడానికి చేసిన ఆ మూడు పథకాలే కేసీఆర్‌ను దెబ్బతీశాయన్నారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల ప్రయోజనం ఉంటుందని తాను అనుకోవడం లేదని అన్నారు. అన్ని ఫోన్లు ట్యాప్ చేసి చివరకు కేసీఆర్ ఏం చేయగలిగారని ప్రశ్నించారు. అలాంటి తప్పుడు పనులు చివరకు వాళ్లనే మింగేస్తాయని చెప్పారు. మంత్రివర్గ విస్తరణ ఫలానా తేదీన చేపడతామని తాను ఎప్పుడూ చెప్పలేదని వివరించారు. ఆ విషయాలు ఏఐసీసీ అధ్యక్షుడి పరిశీలనలో ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
గ్రూప్-1 పరీక్ష నిష్పత్తిని మార్చే ప్రసక్తే లేదు : గ్రూప్-1 పరీక్షల్లో అభ్యర్థుల నిష్పత్తిని 1:100కి మార్చే ప్రశ్నే ఉత్పన్నం కాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు మారిస్తే కోర్టు అయిదు నిమిషాల్లో కొట్టేస్తుందన్నారు. గ్రూప్-1 పోస్టులను భర్తీ చేయకుండా అడ్డుకోవడానికే కొందరు ఈ ఎత్తులు వేస్తున్నారని తెలిపారు. ఒక పరీక్షకు మరోటి అడ్డురాకుండా జాబ్ క్యాలెండర్ తయారు చేస్తున్నామన్నారు.
మూసీ నది అభివృద్ధి కాంగ్రెస్ మార్క్ : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు మార్క్‌గా మూసీ నదిని అభివృద్ధి చేయాలనుకుంటున్నామని రేవంత్‌రెడ్డి చెప్పారు. గండిపేట నుంచి రింగ్‌రోడ్డు వరకు సుమారు 55 కిలోమీటర్ల పొడవునా అభివృద్ధి చేస్తామన్నారు. నీటి అవసరాలు తీర్చడానికి గోదావరి, కృష్ణా నుంచి గండిపేటకు 15 టీఎంసీలు తరలించేలా పెద్ద లైన్ వేస్తామని, ఇందుకోసం త్వరలో టెండర్లు పిలుస్తామని చెప్పారు.
ఇప్పటికే లండన్ థేమ్స్ నదిని చూశామని వచ్చే నెలలో జపాన్, కొరియాకు వెళ్తున్నామని వెల్లడించారు. నదికి రెండువైపుల ఉన్న ఆక్రమణలను తొలగించి భూమిని అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రస్తుతం అక్కడ 10,500 నిర్మాణాలు ఉన్నాయని తేల్చి చెప్పారు. వాటిని ఖాళీ చేయించి వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు లేదా పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
ఈ మార్గంలో పైన మెట్రో రైలు వెళ్లేలా డిజైన్ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం రెండు అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థలను ఎంపిక చేశామన్నారు. మొత్తం 36 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది తమ ఉద్దేశమని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధం లేకుండా త్వరలో కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో వరి పండించే రైతులకు 500 ప్రోత్సాహకం ఇస్తామన్నారని ఈ నిర్ణయంతో సన్నవడ్ల సాగు పెరుగుతుందన్నారు.
ఈవీఎంల తారుమారుకు అవకాశం : "స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని బడ్జెట్ సమావేశాల తర్వాతే ఆలోచిస్తాం. ప్రజల్లో మంచి బలం ఉన్న కాంగ్రెస్ నాయకులంతా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా బాధ్యతలు చేపట్టడం వల్ల లోక్‌సభ ఎన్నికలో కొత్తవారిని ఎంచుకోవాల్సి వచ్చింది. ప్రజల్లో గుర్తింపు ఉన్న నాయకులు అభ్యర్థులు ఉండటం వల్లే బీజేపీకు ఎక్కువ సీట్లు వచ్చాయి. ఈవీఎంలను తారుమారు చేయడానికి అవకాశం ఉంది.
డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉంచినప్పుడు పెద్దగా బందోబస్తు ఉండదు. అక్కడ అవకతవకలు చేయడానికి అవకాశం ఉంది. లోక్‌సభలో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా లేదు. ఆ పార్టీ చరిత్ర ఉందిగానీ భవిష్యత్తు లేదు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం, అలాగే తమ సర్కార్ చేసిన సిఫార్సులన్నింటినీ రద్దు చేసి కొత్తగా ప్రతిపాదనలు పంపుతాం. దానివల్ల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి" అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్కు మరో షాక్ - కాంగ్రెస్‌లో చేరనున్న గద్వాల ఎమ్మెల్యే! - GADWAL BRS MLA TO JOIN CONGRESS