CM Revanth Review on Increasing Telangana Revenue : తెలంగాణ ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే ప్రధాన విభాగాలైన వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, గనుల శాఖల అధికారులతో సచివాలయంలో సీఎం గురువారం సమీక్ష నిర్వహించారు.
గతేడాది ఆదాయంపై సీఎం అసంతృప్తి : గతేడాది ఆదాయం ఆశాజనకంగా లేదని రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరిగేందుకు పక్కా ప్రణాళికతో పని చేయాలని, అవసరమైన సంస్కరణలు చేపట్టాలని ఆదేశించారు. శాఖాపరమైన లొసుగులు లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలన్నారు. నెలవారీ లక్ష్యాలను పెట్టుకొని బడ్జెట్‌లో అంచనాలకు అనుగుణంగా రాబడులను సాధించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
జీఎస్టీ రిటర్నుల్లో అక్రమాలు జరగడానికి వీల్లేదు : జీఎస్టీ ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి తనిఖీలు, ఆడిటింగ్ చేసి జీఎస్టీ వసూళ్లు పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. జీఎస్టీ ఎగవేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించవద్దని తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖలో ఇంతకాలం జరిగిన పొరపాట్లు పునరావృతం కావద్దని, జీఎస్టీ రిటర్నుల్లో అవినీతి అక్రమాలు జరగడానికి వీల్లేదని సీఎం హెచ్చరించారు.
గత ఎన్నికల సమయంలో మద్యం అమ్మకాలు పెరిగినప్పటికీ, దానికి అనుగుణంగా ఆదాయం ఎందుకు పెరగలేదని రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మద్యం అక్రమ రవాణా, పన్ను ఎగవేత లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇసుక ద్వారా ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణా, లీకేజీలకు అడ్డుకట్ట వేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సామాన్యులకు, చిన్న చిన్న నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చూడాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
CM Revanth on Revise Market Value of Lands : తెలంగాణలో భూముల మార్కెట్ విలువలు సవరించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా భూముల రేట్లు భారీగా పెరిగినప్పటికీ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా ఆదాయం మాత్రం దానికి అనుగుణంగా ఎందుకు పెరగడం లేదనే చర్చ జరిగింది. చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు, వాస్తవ క్రయ విక్రయాల రేట్లకు పొంతన లేకపోవడమే ప్రధాన కారణమని అభిప్రాయం వ్యక్తమైంది.
2021లో భూముల విలువను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచినప్పటికీ, ఇంకా చాలాచోట్ల భూముల మార్కెట్ విలువకు, క్రయ విక్రయ ధరలకు భారీ తేడా ఉందని సమావేశంలో చర్చించారు. నిబంధనల ప్రకారం ఏడాదికోసారి సవరించాలి కాబట్టి, దానికి అనుగుణంగా భూముల మార్కెట్ విలువ మార్చేందుకు చర్యలు చేపట్టాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఎక్కడెక్కడ వ్యవసాయ భూములు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు వేటికి ఎంత సవరించాలనేది శాస్త్రీయంగా నిర్ధారించాలని ముఖ్యమంత్రి చెప్పారు.
తెలంగాణ రాబడి పెంపుతో పాటు స్థిరాస్తి, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు, భూముల మార్కెట్ ధరలు సవరించాలని రేవంత్‌రెడ్డి వివరించారు. స్టాంపు డ్యూటీ పెంచాలా, తగ్గించాలా, ఇతర రాష్ట్రంలో ఎంత ఉందనే విషయాలను అధ్యయనం చేయాలని చెప్పారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత లేకుండా సర్దుబాటు చేయాలని అధికారులను ఆదేశించారు. చాలా చోట్ల ఇరుకైన అద్దె భవనాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నందున, స్థలాలు గుర్తించి అధునాతన మోడల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని రేవంత్‌రెడ్డి సూచించారు.
'అమ్మకాలు పెరిగినప్పటికీ మద్యం ఆదాయం ఎందుకు పెరగలేదు' - CM Revanth Review On Income Sources