CM Revanth Tirumala Tour Today 2024 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం 5 గంటలకు కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లనున్నారు. ఇవాళ రాత్రి ఆయన అక్కడే బస చేసి, బుధవారం ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి తిరుమల పర్యటనతో నేడు రేవంత్ రెడ్డి పలు శాఖలపై నిర్వహించాల్సిన సమీక్షలు, ఇతర కార్యక్రమాలు రద్దయినట్లు సీఎం కార్యాలయం తెలిపింది.
Revanth Programs Cancelled Today : మరోవైపు మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ సోమాజిగూడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ఆయన విగ్రహానికి నివాళి అర్పించారు. ఐటీ రంగ వృద్ధికి రాజీవ్ గాంధీ బాటలు వేశారని కొనియాడారు. ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, నేతలు జానారెడ్డి, హన్మంత రావు, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
పాలనపై ఫోకస్ పెట్టిన రేవంత్‌రెడ్డి : సీఎం రేవంత్‌రెడ్డి మొన్నటిదాక లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపారు. ఇక ఎన్నికలు ముగియడంతో ఆయన ప్రజా పాలనపై దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా వరుసగా మంత్రులు, అధికారులతో సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జూన్ 2తో తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తి కానున్నందున, అపరిష్కృత విభజన అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా కార్యాచరణ తయారు చేయాలని సూచించారు.
మరోవైపు రాష్ట్రంలో ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని సీఎం ఆదేశించారు. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం నాడు రేవంత్‌రెడ్డి కేబినేట్ భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షానికి తడిసిన, మొలకెత్తిన ప్రతి వడ్ల గింజనూ కనీస మద్దతు ధరకు ఒక్క రూపాయి కూడా తగ్గకుండా కొనుగోలు చేయాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. వానాకాలం పంట నుంచి సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని తీర్మానించింది. తెలంగాణ దశాబ్ది వేడుకలకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీని ఆహ్వానించాలన్న తీర్మానానికి కేబినేట్ ఆమోద ముద్ర వేసింది.