CM Revanth Reddy on Skill University Establishment in Telangana : రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరున జరిగే అసెంబ్లీ సమావేశాలకు ఒకట్రెండు రోజుల ముందే ఇందుకు సంబంధించి స్పష్టమైన ప్రతిపాదనలతో రావాలని అధికారులతో పాటు పారిశ్రామిక రంగ ప్రముఖులకు సీఎం సూచించారు. వాటిని పరిశీలించి, 24 గంటల్లో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులతో గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీలో సీఎం, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సమావేశమయ్యారు.
5 రోజులకోసారి సమావేశమవ్వండి : గచ్చిబౌలిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఐటీ కంపెనీలతో పాటు ఇటు పరిశ్రమలన్నింటికీ అందుబాటులో ఉన్నందున ఈ ప్రాంగణంలో వర్సిటీ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని రేవంత్ రెడ్డి సూచించారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఐఎస్బీ తరహాలో ఒక బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, అంతవరకు ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులందరినీ తాత్కాలిక బోర్డుగా భావించాలని సీఎం నిర్ణయించారు. పరిశ్రమ అవసరాలకు తగినట్లు ఇందులో ఉండాల్సిన కోర్సులు, కరిక్యులమ్పై అధ్యయనం చేయాలని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు ఇంకా 15 రోజులే ఉన్నందున ప్రతీ 5 రోజులకోసారి సమావేశం కావాలని సీఎం వారికి దిశా నిర్దేశం చేశారు.
నిపుణులైన కన్సల్టెంట్ను నియమించుకోండి : ప్రతిపాదనలు, ప్రాజెక్టు రిపోర్టులన్నీ తయారు చేసేందుకు ఆ రంగంలో నిపుణులైన ఒక కన్సల్టెంట్ను నియమించుకోవాలని సీఎం సూచించారు. ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ ఛైర్మన్ సతీశ్ రెడ్డి, భారత్ బయోటెక్ హరి ప్రసాద్, క్రెడాయ్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి, ఐ ల్యాబ్స్ శ్రీనిరాజు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానికి ముందు ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీలో నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్ను ముఖ్యమంత్రి పరిశీలించారు.