CM Revanth Reddy On Jamili Elections : ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన సీతారాం ఏచూరి సంస్మరణ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన రేవంత్‌రెడ్డి, జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని బీజేపీ కబళించాలని చూస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు.
రాష్ట్రాల కలయికే భారత్ అన్న ముఖ్యమంత్రి, యూనియన్ ఆఫ్ స్టేట్స్ భావనను దెబ్బతీసేలా బీజేపీ జమిలి ఎన్నికలను తీసుకొస్తుందని ధ్వజమెత్తారు. కాషాయ పార్టీని నిలువరించడానికి కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పనిచేసేలా ఏచూరి కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక స్ఫూర్తిని సీతారాం ఏచూరి నిలిపారని కీర్తించారు.
"దశాబ్దాలపాటు పేదల సమస్యలపై సీతారాం ఏచూరి కృషి చేశారు. సీతారాం ఏచూరితో మాట్లాడుతుంటే జైపాల్‌రెడ్డితో మాట్లాడుతున్నట్లు అనిపించింది. జీవితకాలం నమ్మిన సిద్దాంతం కోసం కట్టుబడే ఉండి వ్యక్తులు అరుదు. రాహుల్‌గాంధీతో సీతారాం ఏచూరికి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసి యూపీఏ-1, 2 ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. యూపీఏ-1, 2 హయాంలో పేదలకు అనుకూలమైన పథకాలు తెచ్చారు. పేదలకు అనుకూలమైన పథకాలు తీసుకురావడంలో ఏచూరి కృషి చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్‌పై కేంద్రమంత్రి బిట్టూ అసభ్యంగా మాట్లాడారు. కేంద్రమంత్రి బిట్టూ చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ ఖండించలేదు. భాష, ప్రాంతం, మతాల మధ్య బీజేపీ చిచ్చుపెట్టి అధికారంలో ఉండాలని చూస్తోంది." -రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
సీతారం ఏచూరి ప్రజాస్వామిక స్ఫూర్తికి కృషి చేశారు : దేశ రాజకీయాల్లో ఏచూరి ప్రజాస్వామిక స్ఫూర్తికి కృషి చేశారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పేదల అభ్యున్నతి కోసం పాటు పడ్డారని కొనియాడారు. జీవితకాలం నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉండే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని అలాంటి వారే సీతారాం ఏచూరి అని పేర్కొన్నారు. ఆహార భద్రతా చట్టం, ఆర్టీఐ సహా విద్యాహక్కు చట్టం వంటి వాటిని తీసుకువచ్చినప్పుడు ఏచూరి పోషించిన పాత్ర చిరస్మరణీయమని అన్నారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, తెజస అధ్యక్షుడు కోదండరాం, ఏపీ పూర్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్కందా తదితరులు హాజరై ఏచూరి చిత్రపటానికి పూల మాలు వేసి నివాళులు అర్పించారు.
జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం- శీతాకాల సమావేశాల్లో బిల్లు! - One Nation One Election