CM Revanth Reddy On Indiramma Houses : ఆత్మ గౌరవంతో బతకాలనేది పేదల కల అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్‌ను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రోటీ, కపడా, ఔర్ మకాన్ అనేది ఇందిరమ్మ నినాదమని, ఇల్లు, వ్యవసాయ భూమిని ఆత్మ గౌరవంగా భావిస్తారని తెలిపారు. అందుకే ఇందిరా గాంధీ దశాబ్దాల క్రితమే ఇళ్లు, భూ పంపిణీ పథకాలను ప్రారంభించారని పేర్కొన్నారు.
రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం : దేశంలో గుడి లేని ఊరు ఉండొచ్చు కానీ, ఇందిరమ్మ కాలనీ లేని ఊరు లేదని తెలిపారు. రూ.10 వేలతో ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఇవాళ రూ.5 లక్షలకు చేరుకుందన్నారు. ఇంటి నిర్మాణానికి ప్రతి పేదవాడికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నామని వివరించారు. అర్హులైన వారికే ప్రభుత్వ ఇల్లు చెందాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ రద్దు చేసిన గృహ నిర్మాణ శాఖను పునరుద్ధరించామని తెలిపారు.
పెద్దగా ఇల్లు నిర్మించుకోవచ్చు : కాస్త ఆర్థిక పరిస్థితి బాగున్న వారు పెద్దగా ఇల్లు నిర్మించుకోవచ్చుని రేవంత్ తెలిపారు. తొలి దశలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఈ దశలో ఎస్సీలు, ఎస్టీలు, ట్రాన్స్‌జెండర్లు, అత్యంత పేదలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఐటీడీఏ ప్రాంతాలను ప్రత్యేకంగా పరిశీలించి ఇళ్లు కేటాయిస్తామన్నారు. గోండులు, ఆదివాసీలకు కోటాతో సంబంధం లేకుండా ఇళ్లు ఇస్తామన్నారు.
రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం : గత ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేసిందని మండిపడ్డారు. వేలాది ఇళ్లను పూర్తి చేయకుండా ఎక్కడికక్కడ వదిలేశారని దుయ్యబట్టారు. అసంపూర్తిగా ఉన్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని తాము పూర్తి చేస్తున్నామని తెలిపారు. దీనికోసం ఇటీవల రూ.195 కోట్లు విడుదల చేశామని తెలిపారు.
ఫామ్‌హౌజ్‌లపై మాత్రమే కేసీఆర్ దృష్టి : కేసీఆర్ తనకు అవసరమైన ప్రగతిభవన్‌ను, వాస్తు కోసం సచివాలయాన్ని కూలగొట్టి కొత్త దాన్ని వేగంగా నిర్మించారని విమర్శించారు. దాంతోపాటు ప్రతి జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాలను వేగంగా నిర్మించుకున్నారని, కానీ పేదల ఇళ్లు పూర్తి చేయలేకపోయాని విమర్శించారు. గజ్వేల్, జన్వాడ ఫామ్‌హౌజ్‌ల నిర్మాణంపై మాత్రమే కేసీఆర్ దృష్టి పెట్టారన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ : మొబైల్ యాప్ ద్వారా శుక్రవారం నుంచి లబ్ధిదారుల నమోదు చేయనున్నారు. ప్రతి మండల కేంద్రంలో మోడల్ హౌస్ ఏర్పాటు చేయనున్నారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయనున్నారు. నాలుగున్నర లక్షల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. గ్రామసభల్లో ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హుల ఎంపిక చేయనున్నారు.
గుడ్‌న్యూస్ - ఇందిరమ్మ ఇళ్ల కోసం 'యాప్' సిద్ధం - రేపటి నుంచే లబ్ధిదారుల ఎంపిక
ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ డేట్ వచ్చేసింది - సీఎం చేతుల మీదుగా ఆరోజే శ్రీకారం