CM Revanth Reddy Lanching katamaiah Raksha Safety Kits To Gouds : కల్లుగీత కార్మికుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లుచేసింది. ఇక నుంచి ఎవరు చెట్టుపై నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు ప్రత్యేక కిట్లను తయారుచేసింది. కాటమయ్య రక్షణ కవచం పేరిట 6 పరికరాలున్న కిట్‌ను సిద్ధం చేసింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడ తాటివనంలో గౌడ సోదరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కిట్లను స్వయంగా అందించనున్నారు. ఆ తర్వాత విడుదల వారీగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కల్లుగీత కార్మికులందరికి కాటమయ్య రక్షణ కిట్లను పంపిణీ చేయనున్నారు.
కాటమయ్య రక్షణ కవచం కిట్ల డెమో ప్రదర్శన : బీసీ సంక్షేమ శాఖ, ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో గత 15 రోజులుగా 50 మందితో ఈ కిట్లపై లష్కర్‌గూడలో ట్రయల్ రన్ నిర్వహించారు. రంగారెడ్డి కలెక్టర్ శశాంక వాటిని స్వయంగా పరిశీలించారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాటమయ్య రక్షణ కవచం కిట్ల డెమో ప్రదర్శనను తిలకించి ఐదుగురు కార్మికులకు స్వయంగా కిట్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం గౌడన్నలతో సమావేశంతోపాటు అక్కడే వారితో కలసి సహపంక్తి భోజనం చేయనున్నారు.
సులువుగా తాళ్లు ఎక్కేందుకు కాటమయ్య రక్ష కిట్లు : బీసీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గౌడన్నలకు పంపిణీ చేయనున్న కిట్లను హైదరాబాద్ ఐఐటీతో కలిసి ఓ ప్రైవేట్ సంస్థ తయారుచేసింది. ప్రమాదవశాత్తు తాటిచెట్లపై నుంచి కిందపడకుండా ఆ పరికరాల్లోని అత్యాధునిక సాంకేతికతను వినియోగించారు. 6 పరికరాలుండే ఆ కిట్‌లో తాడు, క్లిప్పులు, హ్యాండిల్స్, స్లింగ్‌బ్యాగ్, లెగ్‌లూప్ వంటివన్నీ వేర్వేరుగా ఉంటాయి. ప్రస్తుతం గీత కార్మికులు ఉపయోగిస్తున్న మోకు తరహాలోనే సులువుగా తాళ్లు ఎక్కేందుకు ఆ కిట్టు దోహదపడుతుంది.
గీత కార్మికుల రక్షణే ధ్యేయంగా : ఏటా సగటు 550 మంది గీత కార్మికులు చెట్లపై నుంచి జారిపడిపోతున్నారు. కొందరు తీవ్రంగా గాయపడి వైకల్యానికి గురవుతుండగా మరి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. గీత వృత్తినే నమ్ముకొని జీవించే కుటుంబాలు దుర్భర స్థితిని గడుపుతున్నాయి. గీతా కార్మికుల సంరక్షణ కోసం గత ప్రభుత్వంలోనూ ఈ తరహా రక్షణ పరికరాలు అందించినా పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అత్యాధునిక పద్దతుల్లో కాటమయ్య రక్షణ కవచాన్ని తయారుచేయించింది. ఈ కిట్లు గీత కార్మికుల రక్షణకు దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి నయా అస్త్రం 'హైడ్రా' - దీని గురించి మీకు తెలుసా? - HYDRA for Disaster Management