CM Revanth Introduced the Resolution in Assembly : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ ఊసెత్తకపోవడం, నిధుల ప్రస్తావన లేకపోవడంపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. కేంద్రప్రభుత్వం వివక్ష చూపిందని విమర్శించిన సీఎం కేంద్రబడ్జెట్‌ను సవరించి తెలంగాణకు నిధులివ్వాలని తీర్మానంలో పేర్కొన్నారు.
మోదీ సర్కార్ తీరుని తప్పుపట్టిన సీఎం రేవంత్ బడ్జెట్‌లో మొండిచేయి చూపడాన్ని నిరసిస్తూ, ఈనెల 27న జరిగే నీతిఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సభలో వెల్లడించారు. పార్టీలకతీతంగా రాష్ట్రప్రయోజనాల కోసం ఒకేతాటిపైకి వచ్చి కేంద్రం మెడలు వంచి నిధులు సాధించుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
"తెలంగాణ రాష్ట్రం పన్నుల రూపంలో ఒక రూపాయి కేంద్రానికి చెల్లిస్తే, రాష్ట్రానికి తిరిగి ఇస్తుంది 47 పైసలు మాత్రమే. కానీ అదే బిహార్ రాష్ట్రం ఒక్క రూపాయి పన్ను చెల్లిస్తే, తిరిగి రూ.7.26 వస్తున్నాయి. పార్టీల, వ్యక్తులు ప్రయోజనాలు కోసమే కొంత మంది సభ్యులు మాట్లాడటం శోచనీయం. తెలంగాణ హక్కుల కోసం, రాష్ట్రానికి రావల్సిన నిధుల కోసం మనమందరం ఏకాభిప్రాయానికి వచ్చి, ఒక్కతాటిపైకి నిలబడితే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మనకు కావల్సిన హక్కులను సాధించుకోవడం పెద్ద సమస్య కాదు."-రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం : అన్ని రాష్ట్రాల సమీకృత, సమ్మిళిత అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం బాధ్యత అయినప్పటికీ, ఫెడరల్ స్ఫూర్తిని విస్మరించిందని తీర్మానం చేసింది. బడ్జెట్‌లో తెలంగాణకు వివక్ష జరిగిందని, రాష్ట్రావిర్భావం నుంచి ఇదే ధోరణి కొనసాగించిందని తీర్మానంలో పేర్కొన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల సుస్థిర అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపింది.
అయితే విభజన చట్టంలోని హామీలు ఇప్పటికీ అమలు కాకపోవడంతో రాష్ట్ర ప్రగతిపై తీవ్ర ప్రభావం చూపిందని తీర్మానంలో ప్రస్తావించింది. సీఎం, మంత్రులు పలుమార్లు ప్రధానిని, మంత్రులను కలిసి, వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం, చట్టప్రకారం రావల్సిన నిధులతో పాటు అపరిష్కృతంగా ఉన్న అనేక అంశాలను కోరినప్పటికీ కేంద్రం పట్టించుకోకుండా వివక్ష చూపిందని శాసనసభ అసంతృప్తి వ్యక్తం చేసింది.
తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరించిన తీరుపై అసంతృప్తిని, నిరసన తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడ్జెట్‌కు సవరణలు చేసి తమ రాష్ట్రానికి న్యాయం జరిగేటట్లు తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. కాగా ఈ తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతు తెలపగా, బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.