CM Revanth Handed Over Appointment Letters to AEEs : అధికారులు జీవితంలో ఎలాంటి తప్పు చేయకూడదో దానికి ఉదాహరణనే, కాళేశ్వరం ప్రాజెక్టు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని జలసౌధలో సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి, 700మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు నియామకపత్రాలు అందజేశారు. రాజకీయాల్లో వివిధ దశల్లో పనిచేశానన్న రేవంత్‌రెడ్డి, క్షేత్రస్థాయిలో బాగా తిరిగితే వివిధ అంశాలపై మంచి అవగాహన ఉంటుందని అధికారులకు సూచించారు.
ఉన్నత అధికారులు చెప్పారని నాణ్యత, నిబద్ధత విషయంలో ఎప్పుడూ రాజీపడొద్దని సూచించారు. నాణ్యత లోపిస్తే ప్రాజెక్టులు దీర్ఘకాలం నిలబడవని, నాణ్యతగా లేకుంటే.. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు ఇన్నేళ్లు ఉండేవి కావని సీఎం వివరించారు. దశాబ్దాల క్రితం నిర్మించిన నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు లక్షల ఎకరాలకు నీళ్లు, విద్యుత్ ఇస్తున్నాయన్నఆయన, ఐదేళ్ల క్రితం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం అప్పుడే కూలిపోయిందని ఆక్షేపించారు.
ఒక దేశం గొప్పతనాన్ని చెప్పేది ఆ దేశంలోని నిర్మాణాలు, కట్టడాలే : నిర్మాణం కంప్లీట్ కాకముందే కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టును ఎలా అధ్యయనం చేయాలని, ఈ ప్రాజెక్టును గత పాలకులు ప్రపంచ అద్భుతంగా వర్ణించారు కదా మరి దీనికి ఎవరిని బాధ్యులుగా చేయాలని సీఎం ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో ఇంజినీర్లు సమర్థంగా పనిచేసి ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదని వ్యాఖ్యానించారు. నిర్మాణ సామగ్రి క్వాలిటీగా లేదని ఇంజినీర్లు వెనక్కి పంపి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అన్నారు. ఒక దేశం గొప్పతనాన్ని చెప్పేది ఆ దేశంలోని నిర్మాణాలు, కట్టడాలేనని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
"గతంలో కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు క్షేత్ర స్థాయిలో తిరిగి గ్రౌండ్ రిపోర్ట్ రాసేవాళ్లు. దానిపై రిమార్క్స్ రాస్తే పై అధికారులు దాన్ని పరిశీలించేవారు. ఇంకా చెప్పాలంటే రాజకీయాల్లో వివిధ దశల్లో నేను పనిచేశాను. క్షేత్రస్థాయిలో బాగా తిరిగితే వివిధ అంశాలపై మంచి అవగాహన ఉంటుంది. క్షేత్రస్థాయిలో పరిశీలించి తీసుకునే నిర్ణయాల్లో తప్పులు దొర్లే అవకాశం తక్కువ." -రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి