Huge Foreign Investments to Telangana : పెట్టుబడుల లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటన విజయవంతం అయిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు అమెరికా పర్యటనలో రూ.31,502 కోట్లు, దక్షిణ కొరియాలో రూ.4,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. రెండు దేశాల్లో కలిపి 25 కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని అన్నారు. జనవరిలో దావోస్ పర్యటనలో జరిగిన ఒప్పందాల మేరకు రాష్ట్రంలో రూ.40,232 కోట్ల పెట్టుబడులకు పలు కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మొత్తంగా ఎనిమిది నెలల్లో రూ.81,564 కోట్లు పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఈనెల 3న అమెరికా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ ఎలక్ట్రానిక్ రంగాలకు చెందిన పలు పరిశ్రమలతో చర్చలు జరిపింది. కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సీసియం, కార్నింగ్, ఆమ్జెన్, జొయిటిస్, హెచ్సీఏ హెల్త్ కేర్, వివింట్ ఫార్మా, థర్మో ఫిసర్, ఆరమ్ ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్, ట్రాక్టర్, అమెజాన్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు, కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి. యాపిల్, గూగుల్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలతో పాటు, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతోనూ రాష్ట్ర బృందం చర్చలు జరిపింది.
అమెరికాలో 19 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. దీంతో రాష్ట్రంలో 30,750 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. దక్షిణ కొరియాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం బృందం వివిధ రంగాల పెట్టుబడులపై దృష్టి పెట్టింది. అందులో ప్రధానంగా ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, ఇంధన స్టోరేజీ, టెక్స్ టైల్స్, సెమీ కండక్టర్ రంగాలు ఉన్నాయి. హ్యుందాయ్ మోటార్స్ తెలంగాణలో మెగా ఆటోమోటివ్ పరీక్షా కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లో ఫ్యాషన్ సిటీని ఏర్పాటుకు యంగ్‌వన్ కంపెనీ ముందుకు రాగా, శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో 10 ఎకరాలు కేటాయించేందుకు ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది.
హైదరాబాద్‌లో ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రా తయారీ : రాష్ట్రంలో కాస్మెటిక్స్ తయారీకి అవకాశాలు, సాధ్యాసాధ్యాల అన్వేషించాలని కొరియన్ బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్‌తో అవగాహన ఒప్పందం చేసుకుంది. కొరియన్ కంపెనీలు డాంగ్‌బాంగ్ ఫార్మా కంపెనీ రూ. 200 కోట్లతో ఏపీఐ తయారీ కేంద్రాన్ని నెలొల్పేందుకు జేఐ టెక్ కంపెనీ రూ.100 కోట్లలతో ఎల్ఈడీ మెటీరియల్ తయారీ ప్లాంట్‌తో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటుకు చావి కంపెనీ హైదరాబాద్‌లో ఈవీ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాని తయారీకి ముందుకొచ్చాయి. సియోల్‌లో ఎల్ఎస్ గ్రూప్, పోస్కో, ఎల్జీ, శామ్సంగ్ సీ అండ్ టీ, శామ్సంగ్ హెల్త్ కేర్, క్రాఫ్టన్, యూయూ ఫార్మా, జీఎస్ కాల్టెక్స్ కంపెనీల ప్రతినిధులతోనూ ముఖ్యమంత్రి బృందం చర్చలు జరిపింది.
భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలో భాగంగా తెలంగాణలో తమ పెట్టుబడులకు అనువైన గమ్య స్థానంగా ఎంచుకోవాలని ఆహ్వానించారు. కొరియాలోని చెంగియీచియోన్ స్ట్రీమ్ రీడెవలప్‌మెంట్, హాన్ రివర్‌ఫ్రంట్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి బృందం సందర్శించింది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం అనుసరించదగిన కొన్ని నమూనాలను సీఎం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఎంతో మంది ఒలింపియన్లను తీర్చిదిద్దిన కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీని సీఎం సందర్శించారు.
ముగిసిన అమెరికా పర్యటన - సియోల్‌కు చేరుకున్న రేవంత్&టీమ్ - CM REVANTH SEOUL TOUR TODAY