CM Revanth Reddy Fires on BRS Chief KCR : గత ప్రభుత్వం దోచుకోవాలని చూసిందని, ఆ దోచుకున్నది దాచుకోవడంపైనే దృష్టి పెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. ఆ ప్రభుత్వ పదేళ్ల అన్యాయాలను గుర్తించి గద్దె దింపారని సీఎం స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఇందిరమ్మ రాజ్యానికి మళ్లీ ప్రజలు అధికారం కట్టబెట్టారని తెలిపారు. ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన నూతనంగా నియమించిన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు నియామకపత్రాలను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అందించారు.
70 రోజుల్లోనే 25 వేల ఉద్యోగాల భర్తీ : సభలో ప్రాజెక్టులపై చర్చపెడితే మాజీ సీఎం కేసీఆర్ రాకుండా పారిపోయారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. పదేళ్లు పదవిలో ఉన్న వ్యక్తి అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు. పదవి కోసం ఔరంగజేబు తన తండ్రిని జైలులో పెట్టారని గుర్తు చేశారు. ఈసారి హరీశ్‌రావుకు పదవి రావాలంటే మరో ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. 3650 రోజులు అధికారంలో ఉండి ఎందుకు ఉద్యోగాలు భర్తీ చేయలేదని, కానీ కాంగ్రెస్ వచ్చిన 70 రోజుల్లోనే 25 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు.
రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టినా లక్ష ఎకరాలకు నీరు అందలేదు : సీఎం రేవంత్ రెడ్డి
అందుకే కేసీఆర్‌ను అసెంబ్లీకి రమ్మని చెబుతున్నాం : ప్రాజెక్టుల విషయంలో తన సలహాలు తీసుకోవాలని కేసీఆర్(KCR) చెబుతున్నారు, అందుకే ఆయన సలహాలు తీసుకోవాలనే అసెంబ్లీకి రమ్మని చెబుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ పారిపోయారని విమర్శించారు. సీఎం కుర్చీలో నల్లమల నుంచి వచ్చిన రైతుబిడ్డ కూర్చుంటే కేసీఆర్ ఓర్వలేకపోతున్నారని ఆగ్రహించారు. వాస్తు బాగోలేదని సచివాలయాన్ని(TS Secretariat) కూల్చి కొత్తది కట్టారని, ఆయన సరిచేసిన వాస్తు తమకు అక్కరకు వచ్చిందన్నారు. కేసీఆర్ దశ బాగోలేకనే ఫాంహౌస్‌కు వెళ్లాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు.
"ఆరు వేలకు పైగా పాఠశాలల హేతుబద్ధీకరణ పేరుతో కేసీఆర్ మూసివేశారు. మెగా డీఎస్సీని ప్రకటించాం. అన్ని పాఠశాలలను మళ్లీ తెరిపిస్తాము. కేసీఆర్ రూ.వేల కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పెట్టారు. వనపర్తిలో ఫీజులు కట్టలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కొడంగల్‌లో రూ.వంద కోట్లతో నమూనా గురుకులాల క్యాంపస్ ఏర్పాటు చేస్తాము. గురుకులాలకు సొంత భవనాలు కట్టిస్తాం. అన్ని నియోజకవర్గాల్లో గురుకులాల క్యాంపస్‌లు ఉన్నాయి. ఒకే క్యాంపస్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు ఉండేలా ఏర్పాటు చేస్తాము. ప్రతి పేదవాడికి విద్యను హక్కుగా మార్చిందే కాంగ్రెస్ పార్టీనే." - రేవంత్ రెడ్డి, సీఎం
CM Revanth Reddy Comments on BRS : బీఆర్ఎస్ ఉద్యోగాలు ఊడగొడితేనే మీకు ఉద్యోగాలు వస్తాయని నాడు చెప్పామని సీఎం రేవంత్ రెడ్డి నూతనంగా ఉద్యోగ నియామకాలు అందుకుంటున్న అభ్యర్థులను ఉద్దేశించి ప్రసంగించారు. పోలీసు, ఎక్సైజ్, ఫైర్ శాఖల్లో 13,444 ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ చేపట్టామని, అలాగే గ్రూప్-1 పరీక్ష(Group 1 Exam) త్వరలోనే నిర్వహిస్తామన్నారు. 567 గ్రూప్-1 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లకు అనుమతిచ్చామని, ఇటీవలే గ్రూప్-4 ఫలితాలు కూడా విడుదల చేశామన్నారు.
ఇలా ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి బీఆర్ఎస్కు సమయం దొరకలేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ నియామకాల చిక్కుముడులు విప్పి, నియామకాలపై పూర్తి దృష్టి పెట్టామని తెలిపారు. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు పెట్టారని, ఇలా ఖర్చు పెట్టిన కనీసం లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేని దోపిడీ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌నని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మేడిగడ్డ కూలితే ఎవరికీ తెలియకుండా పహారా మధ్య నిర్బంధించారన్నారు.
రాష్ట్రంలోని అన్ని తండాలకు బీటీ రోడ్లు, ప్రత్యేక పాఠశాలలు : సీఎం రేవంత్‌రెడ్డి
మరో పదేళ్లు నేనే సీఎంగా ఉంటా - కేసీఆర్ ఎలా వస్తారో చూస్తా : రేవంత్ రెడ్డి