CM Revanth Reddy Review On Sports University : దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో క్రీడలు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. రాష్ట్రంలోని క్రీడా శిక్షణ సంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చేలా, ప్రతీ క్రీడకు ప్రాధాన్యమిచ్చేలా అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండాలని సీఎం తెలిపారు.
యూనివర్సిటీల్లోని క్రీడా విభాగాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని క్రీడా పాఠశాలలు, అకాడమీలు, శిక్షణ సంస్థలన్నింటినీ స్పోర్ట్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే అవకాశం ఉన్న షూటింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, ఆర్చరీ, జావెలిన్ త్రో, హాకీ వంటి క్రీడలకు ప్రాధాన్యమివ్వాలని సీఎం సూచించారు. దేశం, రాష్ట్రంలోని భౌగోళిక పరిస్థితులు, ఇక్కడి యువత శారీరక నిర్మాణం తీరుకు అనువైన క్రీడలను గుర్తించి, వాటిని ప్రోత్సహించాలని సూచించారు.
భవిష్యత్తులో ఒలింపిక్స్ వేదికగా హైదరాబాద్‌ను మార్చాలి : దశాబ్దాల క్రితమే ఆఫ్రో-ఏషియన్, కామన్‌వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యమిచ్చిన హైదరాబాద్‌ను భవిష్యత్తులో ఒలింపిక్స్‌కు వేదికగా మార్చాలని సీఎం అన్నారు. హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహించడమే కాకుండా, ప్రతీ క్రీడలో పతకాలు దక్కేలా రాష్ట్ర యువతను తీర్చిదిద్దాలన్నారు. ఆ దిశగా క్రీడా విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్ది, నిపుణులైన కోచ్‌లతో శిక్షణ ఇప్పించాలని సీఎం తెలిపారు.
తెలంగాణ యంగ్ ఇండియాకు బ్రాండ్‌గా మారాలి : హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ యూనివర్సిటీ దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా ఉండాలన్నారు. ఇటీవల ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారుల శిక్షణపై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతీ లోక్‌సభ నియోజకవర్గంలో ఒక స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ స్పోర్ట్స్ స్కూళ్లలో విద్యా బోధన చేస్తూనే, క్రీడలకు ప్రాధాన్యమివ్వాలని, అక్కడ రాణించిన వారిని మరింత పదును పెట్టేలా స్పోర్ట్స్ యూనివర్సటీలో శిక్షణ ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీ, క్రీడ విశ్వవిద్యాలయానికి యంగ్ ఇండియా పేరు ఖరారు చేయగా, రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు కూడా యంగ్ ఇండియా పేరు పెట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ యంగ్ ఇండియాకు బ్రాండ్‌గా మారాలని సీఎం ఆకాంక్షించారు.