CM Revanth fires on BJP : పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లలో గెలిస్తే, రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధంగా ఉన్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ఇవాళ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని ఎల్బీనగర్, వనస్థలిపురం రైతుబజార్ వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్లమెంట్‌లో తెలంగాణ ఏర్పాటును అవమానించిన బీజేపీని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
సాహసబాలుడు సాయిచరణ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సన్మానం - CM REVANTH APPRECIATES SAI CHARAN
LOK SABHA ELECTIONS 2024 : ప్రశ్నించే గొంతుక ఉండాలని భావించి, గత ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి తనను ఎంపీగా గెలిపించారని, సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మల్కాజ్‌గిరి ప్రజల ఆశీర్వాదంతో ఎంపీని అయ్యానని, తర్వాత పీసీసీ అధ్యక్షుడిని అయ్యానని పేర్కొన్నారు. అందరి ఆశీర్వాదంతో ఇవాళ సీఎంగా ప్రజల ముందుకు వచ్చానని తెలిపారు. మల్కాజ్‌గిరి ఎంపీ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవలేదని, మల్కాజ్‌గిరి నియోజకవర్గం సమస్యలను నా దృష్టికి తీసుకువచ్చే వాళ్లు లేరని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
నాగోల్ నుంచి విమానాశ్రయం వరకు మెట్రో విస్తరించే బాధ్యత తనదేనని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు మెట్రో విస్తరిస్తామని స్పష్టం చేశారు. 9 ఏళ్లుగా మంత్రిగా ఉన్న ఈటల ఎప్పుడైనా ఎల్బీనగర్‌కు వచ్చారా? అని ప్రశ్నించారు. నాకు మోదీ తెలుసు అని చెప్పే ఈటల రాజేందర్, ఈ ప్రాంత సమస్యలను పరిష్కరించారా? అని నిలదీశారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికలప్పుడు బండి సంజయ్ ఇచ్చిన వాగ్దానాలను గుర్తుకు తెచ్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. వరదల్లో బండి పోయిన వారికి బండి ఇస్తామన్నారు. మరి ఇచ్చారా? అని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాష్ట్రానికి ఎంతో నష్టం చేసిందని దుయ్యబట్టారు. మెట్రో ప్రాజెక్టు అడిగితే, బీజేపీ నేతలు జై శ్రీరామ్ అంటున్నారని, రాష్ట్రానికి నిధులు అడిగితే హనుమాన్ జయంతి నిర్వహించాముంటున్నారని ఎద్దెవా చేశారు.
గుడిలో ఉండాల్సిన దేవుడిని బీజేపీ వాళ్లు రోడ్ల మీదకు తెచ్చారని సీఎం రేవంత్ దుయ్యబట్టారు. ఇన్నేళ్లు మనం శ్రీరామనవమి, హనుమాన్ జయంతి జరుపుకోలేదా? అని ప్రశ్నించారు. షెడ్డుకు పోయిన కారు తుప్పు పట్టిపోయిందని, అది మళ్లీ రాదంటూ ధ్వజమెత్తారు. ఓడిపోయి ఉద్యోగం పోయినంక కేసీఆర్‌కు ప్రజలు గుర్తుకు వచ్చారని, మరోసారి ప్రజలను మోసం చేసేందుకు దొంగజపం చేసే కొంగ బయలుదేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ, కేసీఆర్ కలిసి గ్యాస్ సిలిండర్ ధర రూ.1200 పెంచారని, రూ.1200 గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే ఇస్తున్నట్లు సీఎం రేవంత్ పేర్కొన్నారు.
"పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లలో గెలిస్తే, రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధంగా ఉన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ ఏర్పాటును అవమానించిన బీజేపీని, రాష్ట్రం నుంచి బహిష్కరించాలి". - సీఎం రేవంత్
కాంగ్రెస్ ఇచ్చిన ప్రభుత్వ సంస్థలను మోదీ అమ్మేశారు : సీఎం రేవంత్ రెడ్డి - CM Revanth on Modi and KCR