CM Revanth Reddy Comments On BRS Leaders : హైడ్రా ఆక్రమణలకు పాల్పడ్డ బడాబాబులు రాష్ట్ర అర్ధిక మూలాలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ సంస్థలు భయపడొద్దని తాను హామీ ఇస్తున్నానని ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు. అజీజ్‌నగర్‌లో హరీశ్‌రావుకు ఫాంహౌస్ లేదా అని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ వల్లనే హరీశ్‌రావుకు మంత్రి పదవి వచ్చిందన్నారు. కేసీఆర్ కుటుంబానికి దోపిడీ చరిత్ర ఉందని విమర్శించారు. హైడ్రా ఆగదని అక్రమార్కులకు కంటి మీద కునుకు ఉండదని చెప్పారు.
హైదరాబాద్ చార్మినార్ వద్ద నిర్వహించిన రాజీవ్ సద్భావన యాత్ర స్మారక దినోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దేశ సమగ్రత కోసం 34ఏళ్ల క్రితం రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేపట్టారని ప్రతి ఏటా వారి స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు వెళుతున్నామని వివరించారు. ఈ సందర్భంగా హైడ్రాకు కొందరు అడ్డుపడుతున్నారని సీఎం ఘాటుగా స్పందించారు. ఫామ్ హౌస్‌లు కాపాడుకునేందుకు బిల్లా, రంగాలు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని ధ్వజమెత్తారు.
ఫామ్‌హౌస్‌ల వద్దకు ఎప్పుడు రావాలో చెప్పాలని మాజీ మంత్రి హరీశ్ రావుకు సవాల్ విసిరారు. హరీశ్, కేటీఆర్ ఫామ్‌హౌస్‌ల విషయంపై అఖిలపక్షం పిలుద్దామని నిజ నిర్ధారణ కమిటీతో నిజాలు నిగ్గు తేలుద్దామని సీఎం సవాల్ చేశారు. మూసీలో మగ్గిపోతున్న వారికి ఇళ్లు ఇచ్చి, వ్యాపారాలు చేసుకునేందుకు మహిళలకు ఆర్థిక సాయం అందించామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వారిని గుండెల్లో పెట్టుకుంటుంటే బీఆర్ఎస్ నేతలు గుండెలు బాదుకుంటున్నారని విమర్శించారు.
మాజీ మంత్రి గీతారెడ్డికి సద్భావనా అవార్డును సీఎం రేవంత్ ప్రదానం చేశారు. సుదీర్ఘ కాలం ప్రజలకు సేవలందించిన గీతారెడ్డిని సద్భావన అవార్డుకు ఎంపిక చేయడం అభినందనీయమన్నారు. రాజకీయాల్లో పదవుల కోసం పాకులాడే వారిని చూశాం కానీ 2023 ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన గొప్ప వ్యక్తి గీతారెడ్డని తెలిపారు. గాంధీ కుటుంబం తీసుకున్న నిర్ణయాలతోనే కాంగ్రెస్ హయాంలో దేశంలో పేదలకు మేలు జరిగిందన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారన్నారు.
‘‘హైడ్రాను చూపి రియల్ ఎస్టేట్‌ను దెబ్బతీయాలని కొంతమంది చూస్తున్నారు. అజీజ్‌నగర్‌లో హరీశ్‌రావుకు ఫాంహౌస్ లేదా? గతంలో కాంగ్రెస్ వల్లనే హరీశ్‌రావుకు మంత్రి పదవి వచ్చింది. కేసీఆర్ కుటుంబానికి దోపిడీ చరిత్ర ఉంది. తెలంగాణ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని చూస్తున్నారు"- రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
సుందరీకరణ కాదు - మూసీ నది పునరుజ్జీవం : సీఎం రేవంత్
నెలాఖరులోపు మంత్రివర్గ విస్తరణ! - ఎల్లుండి దిల్లీకి సీఎం రేవంత్ పయనం