CM Revanth Reddy On Employee Demands : ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షుడిగా, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా కె.కేశవరావు ప్రత్యేక ఆహ్వానితుడిగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పెండింగ్ డీఏలపై శుక్రవారం సాయంత్రంలోగా నిర్ణయం ప్రకటించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
డిమాండ్ల సాధన కోసం పోరుకు సిద్ధమవుతున్న ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని పునరుద్ఘాటించారు. రెండేళ్ల నుంచి పెండింగులో ఉన్న అయిదు డీఏలు విడుదల చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు సీఎంను కోరారు. పెండింగులో ఉన్న బిల్లులను క్లియర్ రద్దు, ఈ-కుబేర్ వ్యవస్థ రద్దు, ఉద్యోగులు, పెన్షనర్ల సమాన వాటాతో ఈహెచ్ఎస్ అమలు చేయాలని కోరారు.
సీపీఎస్, యూపీఎస్ వద్దని.. పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని, జీవో 317 ప్రకారం బాధితులు కోరుకున్న చోటుకు బదిలీ చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీపావళి తర్వాత శాఖల వారీగా ఉద్యోగులతో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై సమస్యల పరిష్కారానికి సిఫార్సు చేస్తుందని తెలిపారు. డీఏలపై ఇవాళ నిర్ణయం ప్రకటించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. జీవో 317పై మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక రేపు కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం చెప్పినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉందని ఈ సందర్భంగా ఉద్యోగులతో సీఎం అన్నట్లు సమాచారం. నెలవారీ ఆదాయం తగ్గిందని, అందులో ఉద్యోగుల వేతనాలు, అప్పులపై వడ్డీలకే సగం ఖర్చవుతోందని వివరించినట్లు తెలుస్తోంది. కొన్ని ఆర్థిక పరమైన డిమాండ్లపై ఉద్యోగులు కూడా అర్థం చేసుకోవాలని కోరినట్లు సమాచారం.