Compensation For Police Martyrs in Telangana : దేశ భద్రత, ప్రజల రక్షణలో పోలీసుల పాత్ర ఎనలేనిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సజావుగా ఉన్నాయంటే పోలీసులే కారణమని తెలిపారు. అమరులైన కానిస్టేబుల్, ఏఎస్సై కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇస్తామని ప్రకటించారు. అమరులైన ఎస్సై, సీఐ కుటుంబాలకు రూ.కోటి 25 లక్షలు, డీఎస్పీ, ఏఎస్పీ కుటుంబాలకు రూ.కోటి 50 లక్షలు, ఎస్పీ, ఐపీఎస్ కుటుంబాలకు రూ.2 కోట్ల పరిహారం ఇస్తామని తెలిపారు.
శాశ్వత అంగవైకల్యం పొందిన పోలీసులకు పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందేందుకు శాంతిభద్రతలే కీలకమని వ్యాఖ్యానించారు. పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు అదుపులో ఉండాలని, శాంతిభద్రతలు, నిఘా విషయంలో రాష్ట్ర పోలీసుల పాత్ర కీలకమని వెల్లడించారు. హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో పోలీసు సంస్మరణ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. పోలీసుల ఫ్లాగ్‌డే పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పోలీసులకు అండగా ప్రభుత్వం : ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధినిర్వహణలో అమరులైన పోలీసులకు ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం అమరుల కుటుంబాలను ఆదుకుంటామనే నమ్మకం కలిగిస్తుందని అన్నారు. అమరులైన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పెరుగుతున్న ఆధునిక సాంకేతికత ద్వారా నేరాలు చేస్తున్నారని, నేరగాళ్లు సరికొత్త విధానాలతో ముందుకొస్తున్నారని వ్యాఖ్యానించారు.
"తెలంగాణ పోలీసుల విధానాలను ఇతర రాష్ట్రాలు పాటిస్తున్నాయి. మన ఫోరెన్సిక్ ల్యాబ్ అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. మన సైబర్‌క్రైమ్ విభాగం దేశంలోనే గొప్పదని కేంద్ర హోంశాఖ అభినందించింది. ఇవాళ డ్రగ్స్ మహమ్మారి యువతను పట్టిపీడిస్తోంది. డ్రగ్స్ వల్ల పంజాబ్ అనేక కష్టాలు ఎదుర్కొంటోంది. మన రాష్ట్రంలో డ్రగ్స్ ఉత్పత్తి చాలా తక్కువ. డ్రగ్స్ వినియోగం మాత్రం ఇక్కడ క్రమంగా పెరుగుతోంది. డ్రగ్స్ నివారణకు సరికొత్త చర్యలు తీసుకుంటున్నాం. ఏఐ పరిజ్ఞానం ద్వారా ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించేవారిని గుర్తిస్తున్నాం. నేరగాళ్లను కఠినంగా శిక్షించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది." - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
శాంతిభద్రతలను చేతుల్లోకి తీసుకోవద్దని ప్రజలను కోరుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పోలీసుల సహకారంతో అన్ని పండుగలను ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. శాంతిభద్రతలు కాపాడేందుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని వెల్లడించారు. టీజీ న్యాబ్ ద్వారా నార్కోటిక్స్ నియంత్రిస్తున్నామన్న ఆయన నేరాలు అరికట్టేందుకు రాష్ట్ర పోలీసులు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు ఎప్పుడూ ముందుంటామని పేర్కొన్నారు.
మీ అన్నగా నేనున్నాను - ఆందోళన విరమించి మెయిన్స్‌కు సిద్ధంకండి : రేవంత్ రెడ్డి
జీవితంలో రిస్క్ లేనిదే - మంచి విజయాలు సాధించలేం : సీఎం రేవంత్ రెడ్డి