CM Revanth America Tour for Investments : రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా, దక్షిణ కొరియా దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆగస్టు 14 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. సీఎం వెంట సీఎస్ శాంతికుమారి, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు వెళ్లనున్నారు. ఆగస్టు 4న మంత్రి శ్రీధర్‌బాబు, 5న మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా అమెరికా పర్యటనకు బయలుదేరుతారు. వీరు అక్కడ రేవంత్ బృందంతో కలుస్తారు. ఈ నెల తొమ్మిదో తేదీ వరకు న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కో నగరాల్లో పర్యటించి పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అవుతారు.
ఈ సందర్భంగా పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలున్నాయి. అమెరికాలోని ప్రవాస భారతీయులతోనూ సమావేశమవుతారు. సీఎం రేవంత్‌రెడ్డి బృందం ఇవాళ న్యూయార్క్‌కు చేరుకుంటుంది. ఈనెల 4న న్యూజెర్సీలో ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. 5వ తేదీన న్యూయార్క్‌లో కాగ్నిజెంట్ సీఈవో, సహా ఆర్‌సీఎం, టీబీసీ, కార్నింగ్, జోయిటస్ సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతారు. అలాగే ఆర్గా సీఈవో రామకృష్ణ, పీ అండ్ వో సంస్థ సీవోవో శైలేష్ జెజురికర్, ర్యాపిడ్ ఏడుగురు ప్రతినిధులతో సమావేశమవుతారు. ఈనెల 6న పెప్సికో, హెచ్‌సీఏ ఉన్నతాధికారులతో సమావేశమైన తరువాత న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ చేరుకుంటారు.
ఐటీ సేవల సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశం : ఇక్కడ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమవుతారు. అనంతరం డల్లాస్‌కు వెళ్తారు. ఈ నెల 7న ఛార్లెస్ స్క్వాబ్ హెడ్, మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా సందర్శన, ఐటీ సేవల సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశం ఉంటాయి. 8వ తేదీన కాలిఫోర్నియాలో ట్రినెట్ సీఈవో, ఆరమ్, ఆమ్‌జెన్, రెనెసాస్, అమాట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. సెలెక్ట్ టెక్ యూనికార్న్స్ ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి, సెమీ కండక్టర్ రంగానికి చెందిన పలు సంస్థలతో రౌండ్ టేబుల్ భేటీలో పాల్గొంటారు. ఈ నెల 9న గూగుల్ సీనియర్ ప్రతినిధులతో భేటీ ఉంటుంది.
స్టాన్‌ఫోర్డ్ బయోడిజైన్ సెంటర్ సందర్శన, అమెజాన్ వైస్ ప్రెసిడెంట్, జెడ్ స్కేలర్ సీఈవో, ఎనోవిక్స్, మోనార్క్ ట్రాక్టర్స్, థెర్మోఫిషర్ సైంటిఫిక్ ప్రతినిధులను కలుస్తారు. ఈ నెల 10న అమెరికా నుంచి బయలుదేరి 11న దక్షిణ కొరియా సియోల్ చేరుకుంటారు. 12 తేదీన సియోల్‌లో యూయూ ఫార్మా, కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్స్ ఇండస్ట్రీ, ఎల్‌ఎస్ హోల్డింగ్స్, హ్యుందాయ్ మోటార్స్ ప్రతినిధులు సహా ఆ దేశ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. 13న హాన్ రివర్ ప్రాజెక్టుపై డిప్యూటీ మేయర్ జూ యంగ్ టాయ్‌తో భేటీ ఉంటుంది.
14న హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం : కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. సామ్‌సంగ్, ఎల్‌జీ సంస్థల ప్రతినిధులతోనూ సీఎం రేవంత్‌రెడ్డి బృందం చర్చలు జరపనుంది. ఈ నెల 14న ముఖ్యమంత్రి బృందం హైదరాబాద్‌కు రానుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పెట్టుబడుల కోసం రేవంత్‌రెడ్డి విదేశాల్లో పర్యటించడం ఇది రెండోసారి.
పెట్టుబడుల వేటకు సీఎం రేవంత్ - రేపటి నుంచి యూఎస్, సౌత్ కొరియా టూర్