CM Revanth on Chandrababu Naidu Oath Ceremony : టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తే తమ పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీలో ఘనవిజయం సాధించిన మహా కూటమికి ఆయన అభినందనలు తెలిపారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ చట్టపరంగా తేలిపోయిందని అన్నారు. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణ రాజధాని అని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్తో ఉన్న సమస్యలను సామరస్యంగానే పరిష్కరించుకుంటామని రేవంత్రెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా చట్టబద్ధతతో కూడుకున్న హామీ అని, ప్రత్యేక హోదా ఇవ్వడానికి కట్టుబడ్డామని ఇప్పటికే రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. విభజన చట్టం మేరకు మిగతా ఆస్తి, నీటి పంపకాల గురించి ఏపీతో చర్చించి పరిష్కరించుకుంటామని వివరించారు. రాష్ట్ర అభివృద్ధి, అభ్యున్నతి కోసం ఎవరితోనైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. సమావేశంలో కాంగ్రెస్ పోటీ చేసిన ఎంపీ స్థానాలపై ప్రశ్నించగా పార్టీ సూచనల మేరకే తాను నడుచుకుంటానని, ఓటమి ఒకరి ఖాతాలో గెలుపు తన ఖాతాలో వేసుకునే వ్యక్తిని కాదని పేర్కొన్నారు.