CM Revanth Orders to Expand GHMC : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి మణిహారమైన ఔటర్ రింగ్‌రోడ్డు వరకు జీహెచ్‌ఎంసీని విస్తరించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలోని నగరపాలికలు, పురపాలక సంఘాలను(Municipalities) కలిపి మహా గ్రేటర్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రణాళికను వచ్చే జూన్ నాటికి పూర్తి చేయనున్నారు. అనంతరం ముఖ్యమంత్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటున్నట్లు ఓ సీనియర్ ఆఫీసర్ చెప్పినట్లు సమాచారం.
మరో అరవై డివిజన్లు పెరిగే అవకాశం : పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు ఇంకా సమయం ఉండటంతో ప్రైమరీ నివేదికను ఎన్నికల కోడ్ తరువాత సీఎం ముందుంచాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో 150 డివిజన్లు ఉన్నాయి. ఇందులో దాదాపు 74 లక్షలమంది ఓటర్లు ఉన్నారు. జనాభా కోటి సంఖ్య వరకూ ఉంది. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలను బల్దియాలో విలీనం చేస్తే జనాభా మరో 60 లక్షల వరకు పెరుగుతుందని అంచనా లెక్కలు వేశారు.
ఇకపై జీహెచ్‌ఎంసీ కాదు - హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్!
దీంతో అదనంగా మరో 50 నుంచి 60 డివిజన్ల వరకు పెరుగుతాయని అధికారులు అంటున్నారు. అప్పుడు డివిజన్ల సంఖ్య 210 వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రణాళికనే సీఎం రేవంత్ ముందు పెట్టాలని అధికారులు యోచిస్తున్నారు. మహా గ్రేటర్ పెద్దగా ఉంటుందని ముఖ్యమంత్రి(CM Revanth Reddy) భావిస్తే దీన్ని రెండుగా చేయమని ఆదేశించినా, అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందిస్తామని ఓ సీనియర్ అధికారి ఈటీవీ భారత్‌కు తెలిపారు.
Hyderabad Improvement in Congress Govt : 2007 సంవత్సరంలో 12 మున్సిపాల్టీలు, 8 గ్రామపంచాయతీలను కలిపి జీహెచ్‌ఎంసీని ఏర్పాటు చేశారు. దాదాపు కోటి జనాభా ఉండడంతో 150 డివిజన్లను నెలకొల్పారు. ఉన్నంతలో వివిధ రూపాల్లో బల్దియాకు ఆదాయం సమకూరడంతోపాటు గవర్నమెంట్ ఇచ్చిన నిధులతో చాలా వరకు అభివృద్ధి పనులు చేపట్టారు.
ఇదే సమయంలో రాజధాని చుట్టుపక్కల ఉన్న ఏడు నగరపాలక సంస్థలు, 21 మున్సిపల్ సంఘాల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఈ నేపథ్యంలో గ్రేటర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. రాజధాని పరిధిలో ప్రస్తుతం ఐదు బృహత్ ప్రణాళికలు(Master Plans) ఉండటంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఐదింటిని విలీనం చేసి వచ్చే 30 ఏళ్లపాటు అమలులో ఉండే విధంగా ఒకే మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
బల్దియాను విస్తరించాలని సీఎం ఆదేశం : దీనికి అనుగుణంగా ప్రభుత్వ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. ఇదే సమయంలో గ్రేటర్‌ను కూడా విస్తరించాలని రేవంత్‌రెడ్డి భావించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న సంస్థలన్నింటిని కలిపి మహా గ్రేటర్‌ను ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. మూడు నెలల్లో దీనిపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో పురపాలక శాఖ అధికారులు అదే పనిలో నిమగ్నమయ్యారు.
గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో అభివృద్ధే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్-2050
బల్దియాలో భారీ కుంభకోణం - బస్ షెల్టర్లు, మెట్రో పిల్లర్లపై అక్రమంగా వాణిజ్య ప్రకటనలు