CM Revanth Reddy met Union Ministers : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం దిల్లీలో ముగ్గురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో కలిసి కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్, పెట్రోలియం, సహజవాయువుల వ్యవహారాల మంత్రి హర్‌దీప్‌సింగ్ పురి సహా ఆహారం, ప్రజాపంపిణీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిలతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న మూసీ నదీతీర అభివృద్ధికి సహకరించాలని సీఆర్ పాటిల్‌ను కోరారు. జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో మురుగునీటి శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
గోదావరి జలాలను ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లలో నింపే పనులకు 6 వేల కోట్లు కేటాయించాలని కోరారు. 2019లో ప్రారంభమైనా జల్‌జీవన్ మిషన్ పథకం కింద ఇంతవరకు రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదని గుర్తుచేశారు. తెలంగాణలో 7.85 లక్షల ఇళ్లకు ఇంకా నల్లా కనెక్షన్లు ఇవ్వలేదని వివరించారు. పీఎంఏవై(PMAY) కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు రూ.16,100 కోట్లు ఖర్చవుతుందని జల్‌జీవన్ మిషన్ కింద ఈ ఏడాది నుంచి నిధులు కేటాయించాలని కోరారు.
ధాన్యం సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించి బకాయిలు విడుదల చేయాలి : రాష్ట్రంలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్న విషయాన్ని హర్దీప్ సింగ్ దృష్టికి తీసుకెళ్లిన రేవంత్ రెడ్డి, వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే అవకాశం ఇవ్వాలని కోరారు. అనంతరం కేంద్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావల్సిన బకాయిల వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
"పదేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడం వల్ల పెద్ద ఎత్తున రూ.1800 కోట్ల వరకు వడ్డీ కట్టాల్సి వచ్చింది. వెంటనే ఈ రూ.1800 కోట్లను వెంటనే విడుదల చేయాలని కేంద్రమంత్రిని అడిగాం. వారు కూడా పాజిటివ్‌గా స్పందించారు. రెనెవబుల్ ఎనర్జీ గురించి కూడా వారితో మాట్లాడాం. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నిధులు వ్యవస్థలు బాగు చేసుకోవడానికి ముగ్గురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యాం." - భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం
CM Revanth met Congress Leaders : ఆ తర్వాత కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీని కలిసేందుకు ఆమె నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్‌గాంధీని కలిశారు. ఆయన వెంట మంత్రులు భట్టి, ఉత్తమ్ సహా మున్షీ ఉన్నారు. అంతకుముందు హస్తిన పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీతో రాష్ట్ర నేతలతో కలిసి సీఎం భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి సహా మంత్రులు రేపు హైదరాబాద్ రానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.