CM Revanth Felicitates Jeevanji Deepti : పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన రాష్ట్ర యువ అథ్లెట్ దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంతకుముందు దీప్తిని సీఎం అభినందించారు. ఆమె కుటుంబ సభ్యులు, కోచ్, నేతలు, అధికారులు రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
కోటి రూపాయల నజరానా : జీవాంజి దీప్తికి గ్రూప్-2 ఉద్యోగం, కోటి రూపాయల నగదు బహుమతి, వరంగల్‌లో 500 గజాల స్థలం ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీప్తి కోచ్ ఎన్.రమేశ్‌కు పది లక్షల రూపాయలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పారాలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు శిక్షణ, ఇతర ప్రోత్సాహం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, శాట్ ఛైర్మన్ శివసేనా రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ జీవాంజి దీప్తి ప్రస్థానం : అథ్లెట్ జీవాంజి దీప్తి స్వగ్రామం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామం. దీప్తి విజయాల వెనక తల్లిదండ్రులు యాదగిరి, లక్ష్మి కృషి అపారం. వారిది నిరుపేద కుటుంబం. దీప్తికి మానసిక వైకల్యం ఉండటంతో ఆమె తండ్రి తల్లడిల్లారు. కుమార్తెకు ఫిట్స్ వస్తే విలవిలలాడిపోయేవారు. ఒకానొక దశలో దీప్తి క్రీడల్లో రాణించేందుకు వెనకాడవద్దని యాదగిరి తనకున్న ఎకరం పొలాన్ని అమ్మేందుకు కూడా లెక్కచేయలేదు.
తల్లిదండ్రుల ప్రోత్సాహం, జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని సాధించాలనే తపనతో జీవాంజి దీప్తి తిరుగులేని క్రీడాకారిణిగా మారింది. ఒకప్పుడు దీప్తి మానసిక స్థితి చూసి ఇరుగుపొరుగు వారు ఆమెను తరచూ అవహేళన చేసేవారట. వాటన్నింటిని లెక్కచేయకుండా మొక్కవోని దీక్షతో ప్రయత్నించి ఏకంగా పారాలింపిక్స్‌లో పతకం సాధించి తల్లిదండ్రులకు, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. కాగా 400 మీటర్ల టీ-20 విభాగం ఫైనల్లో దీప్తి 55.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని మూడో స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని ముద్దాడింది. దీప్తి విజయం పట్ల ఆమె తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.