CM Revanth Reacts on Sabitha Indra Reddy Comments : అసెంబ్లీలో తాను ఎక్కడా అసభ్యంగా, అన్ పార్లమెంటరీగా మాట్లాడలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితకు మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇచ్చారన్నారు. సబితా ఇంద్రారెడ్డి తన వ్యక్తిగత విషయాలను మాట్లాడినందుకే, తాను మిగతావి కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. సునీత లక్ష్మారెడ్డి కోసం 2018 ఎన్నికల ప్రచారానికి వెళితే తనపై రెండు కేసులు పెట్టారని కౌడిపల్లి, నర్సాపూర్‌లో ఇప్పటికీ ఉన్నాయన్నారు. కానీ సునీత లక్ష్మారెడ్డి అధికార పార్టీలోకి వెళితే తన కోసం ప్రచారం చేసిన తమ్ముడిపై కేసులు తీసేయాలని కోరకుండా మహిళ కమిషన్ పోస్టు తీసుకొని ఆ తర్వాత ఎమ్మెల్యే అయితే సరిపోతుందా అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కేసీఆర్, హరీశ్‌రావు అసెంబ్లీకి డుమ్మా : అక్కల మాటలు నమ్మి మోసపోయానని కేటీఆర్ చెప్పానన్న సీఎం సభలో ఎవరి పేరు ప్రస్తావించలేదని సీఎం అన్నారు. తనను కాంగ్రెస్‌లోకి రమ్మని చెప్పిన సబితక్క అండగా ఉండాల్సింది పోయి పార్టీ మారారన్నారు. తన ఎన్నిక బాధ్యత తీసుకుంటానన్న సబితక్క నామినేషన్ వేసేటప్పటికే వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. మోసానికి పర్యాయపదమే సబితా ఇంద్రారెడ్డి అని భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారన్నారు. తనకు అన్యాయం జరిగిందంటూ సబితా ఇంద్రారెడ్డి ఇంత అవేదన చెందుతుంటే కేసీఆర్, హరీశ్ రావు ఎటుపోయారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
అసెంబ్లీకి వచ్చి సబితక్కకు అండగా ఉండకుండా ఎందుకు డుమ్మాకొట్టారని ప్రశ్నించారు. అసెంబ్లీలో మాట్లాడేందుకు కేటీఆర్, హరీశ్ రావు చాలు అనుకుంటే కేసీఆర్‌ను ఎందుకు ఫ్లోర్ లీడర్‌గా ఎన్నుకున్నారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అలాంటప్పుడు ఫ్లోర్ లీడర్‌గా కేసీఆర్‌ను తొలగించాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు బాధ్యత రాష్ట్రం పట్ల పట్టింపు లేదని ధ్వజమెత్తిన రేవంత్ రెడ్డి కేసీఆర్‌కు అధికారం లేకపోతే ప్రజల సమస్యలను పట్టించుకునే ఆలోచన ఉండదన్నారు.
17 గంటల పాటు సభ : గత పదేళ్లతో పోలిస్తే అసెంబ్లీని తాము ప్రజాస్వామికంగా నడుపుతున్నామని సభలో విపక్ష సభ్యులకే ఎక్కువ టైమ్ లభించిందని సీఎం అన్నారు. చాలా టైం ఇచ్చినా అవకాశం ఇవ్వలేదని విపక్ష నేతలు అంటున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో ఇంత సుదీర్ఘ చర్చలు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నడూ జరగలేదని ఒక్కో రోజు 17 గంటల పాటు సభ జరిగిందన్నారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు, జగదీష్ రెడ్డి ముగ్గురే ఆరు గంటల పాటు మాట్లాడరని తనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ముగ్గురం కలిసి కూడా అంతసేపు మాట్లాడలేదన్నారు.
ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం : అసెంబ్లీ సమావేశాలు పూర్తి ప్రజాస్వామికంగా, బాధ్యతగా జరుగుతున్నాయని చర్చను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినప్పటికీ బాధ్యతగా వ్యవహరించామని సీఎం అన్నారు. బడ్జెట్, పద్దులు, ద్రవ్య వినిమయ బిల్లుపైనా అందరికీ మాట్లాడే అవకాశం లభించిందని వీలైనంత చర్చ జరిగిందన్నారు. ఇవాళ్టి లోగా ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందటం తప్పనిసరి కాబట్టి తక్కువ రోజులు జరిగినట్లు అనిపించినప్పటికీ ఒక్కో రోజు 17 గంటలు సభ జరిగిందన్నారు. ఎన్ని రోజులు జరిగిందనే దానికంటే ఎంత సమయం చర్చ జరిగిందనేది ముఖ్యమన్నారు.
ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు : అసెంబ్లీలో బహిష్కరణలు, సస్పెన్షన్లు, మార్షల్స్ అవసరం రావద్దని తమ ఆలోచనని అయితే అలాంటి అవసరం, సందర్భం వస్తే స్పీకర్ తగిన నిర్ణయం తీసుకుంటారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అవసరాన్ని బట్టి ఎమ్మెల్యేల సభ్యత్వం కూడా రద్దు కావొచ్చునన్న సీఎం గతంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాలు రద్దు చేశారని ప్రస్తావించారు. గతంలో తనను కూడా ఒక సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తే నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరుగుతోందని హైకోర్టులో పిటిషన్ వేసినట్లు తెలిపారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్లో చేరారన్న ప్రచారంపై స్పందించిన ముఖ్యమంత్రి కలిసి టీ తాగేందుకు వెళ్లి ఉంటారన్నారు. కలిసి టీ తాగడానికి, పార్టీలో చేరడానికి సంబంధం ఉండదన్నారు. ఇటీవల 8, 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి తనతో టీ తాగారని అంత మాత్రాన వారందరూ కాంగ్రెస్‌లో చేరినట్టా అని ప్రశ్నించారు.