CM Revanth and Ministers to Visit Medigadda : మేడిగడ్డ బ్యారేజీని ఇవాళ సాయంత్రం ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy), పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరారవుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం పార్టీకు సంబంధించి ఐదుగురు నేతలు ప్రాజెక్టు దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించారు. బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు ఈ పర్యటనకు దూరంగా ఉన్నారు.
ఉదయం అసెంబ్లీ నుంచి బస్సులో బయలుదేరిన ప్రజాప్రతినిధులు సాయంత్రం 3గంటలకు మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్నారు. ప్రధానంగా బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్‌లోని పియర్స్‌ను పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బ్యారేజి లోటుపాట్లను ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
అందుకే అన్ని పార్టీల సభ్యులకు మేడిగడ్డ చూపించాలని నిర్ణయించాం : శ్రీధర్ బాబు
CM Revanth Fire on KCR : కాళేశ్వరం ద్వారా ఇప్పటివరకు లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదని ఆరోపించారు. కేసీఆర్ మాత్రం కోటి ఎకరాలకు నీరు ఇచ్చామని చెప్పారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అక్టోబర్ 21న మేడిగడ్డ పిల్లర్లు కుంగాయని ఇంజినీర్లు తెలిపారని, నిర్మాణంలో నాణ్యతాలోపం ఉందని డ్యామ్ సేఫ్టీ అథారిటీ(Dam Safety Authority) వివరించిందని సీఎం వివరించారు. 2020-21లోనే సమస్య ఉందని ఇంజినీర్లు చెప్పారన్న సీఎం, సమస్యను చక్కదిద్దే పని చేపట్టకుండా నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు.
"2020 మేలోనే ప్రాజెక్టులో సమస్యలు బయటపడ్డాయి. సమస్యలపై వరుసగా మూడు సంవత్సరాలు అధికారులు ఎల్అండ్టీకి నోటీసులు ఇచ్చారు. 2019 లోనే పూర్తయిన ప్రాజెక్ట్‌కు 2020 లో పూర్తిగా సమస్యలు బయటపడ్డాయి. అయినప్పటికీ రూ.15,900 కోట్ల బిల్లులు చెల్లించారు. అధికారులు లెటర్స్ రాసినా, ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈరోజు మొత్తం కుంగిపోయి, కూలిపోయే స్థితికి వచ్చింది. మేము దిగిపోయాము కాబట్టి మాకేం సంబంధం లేదని కేసీఆర్ చెబుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తవటంతో మా బాధ్యత తీరిపోయిందని ఎల్అండ్టీ చెబుతోంది."-రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏటా విద్యుత్ బిల్లులే రూ.10,500 కోట్లు అని అన్నారు. కాళేశ్వరం రుణాలు, ఇతర ఖర్చులు కలిపి ఏటా రూ.25 వేల కోట్లు అవసరమని సీఎం పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కట్టిన ఏ బ్యారేజీలోనూ ఇప్పుడు నీరు లేదని, మేడిగడ్డ, సుందిళ్ల(Sundilla Project), అన్నారం బ్యారేజీల్లో ఒకే తరహా సమస్య ఉందని రేవంత్ తెలిపారు. ప్రస్తుతం సీపేజీ చేసి అన్నారం, సుందిళ్లలో సమస్యను కప్పిపుచ్చారని తెలిపారు. వానాకాలం నీరు వస్తే, సుందిళ్ల, అన్నారంలో కూడా సమస్యలు బయటడపడతాయని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు పూర్తయ్యిందని చెప్పిన మరుసటి సంవత్సరమే సమస్యలు బయటడ్డాయని, అయినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని రేవంత్ దుయ్యబట్టారు.
'మేడిగడ్డ పర్యటనతో కేసీఆర్ పాలనలో విధ్వంసమైన జలదృశ్యాన్ని తెలంగాణ సమాజం కళ్లారా చూడబోతోంది'
నేడు మేడిగడ్డలో సీఎం, ప్రజాప్రతినిధుల పర్యటన - 800 మందితో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు