CM Jagan Neglect Roads in AP : ఒక్క ఛాన్స్ అంటూ అధికారం చేపట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు రివర్స్ పాలనతో రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేసింది. అప్పులు చేయడంతో రికార్డులు సృష్టిస్తూ అభివృద్ధిని అటకెక్కించింది. రహదారుల నిర్మాణం, మరమ్మతులు, విస్తరణ వంటి పనులతో సంబంధం లేదన్నట్లు వ్యవహరించి వాహనదారులు రోడ్డెక్కాలంటేనే భయపడేలా చేయటంలో సఫలీకృతమైంది. జగన్ ప్రభుత్వ నిర్వాకంతో గుంతలమయంగా మారిన రహదారుల మరమ్మతులకు రూ. 43 వేల కోట్లు అవసరమవుతాని ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. ఈ భారమంతా కొత్త ప్రభుత్వంపైనే పడనుంది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో గుంతల రోడ్లతో ప్రజలు నరకం చూశారు. ఏయేటికాయేడు గుంతలను పూడ్చాల్సి ఉన్నా జగన్ సర్కార్ పట్టించుకోలేదు. వాహనాల రద్దీ పెరిగినా రోడ్లను విస్తరించలేదు. వంతెనలు కూలిన కొత్తవి నిర్మించలేదు. ఏటా 7 నుంచి 8వేల కిలోమీటర్ల పునరుద్ధరణ పనులకు తిలోదకాలిచ్చింది. మొత్తంగా రాష్ట్రంలో 45 వేల కిలో మీటర్ల ఆర్ అండ్ బీ రోడ్లు ఉంటే వాటిలో 25 వేల 413 కిలోమీటర్ల మేర అధ్వానంగా మారినా జగన్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపింది. వీటన్నింటినీ బాగుచేయాలంటే అక్షరాలా రూ. 43 వేల కోట్లు కావాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇప్పుడీ భారమంతా కొత్త ప్రభుత్వంపై పడనుంది.
రోడ్డు వేస్తేనే ఓట్లేస్తాం - గుర్రాలపై గిరిజనుల వినూత్న నిరసన - First Roads Then Votes
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, జిల్లా, రాష్ట్ర రహదారులు కలిపి 45 వేల కిలోమీటర్లు ఉన్నాయి. వీటిలో 9 వేల 86 కిలోమీటర్లు అత్యంత ఘోరంగా ఉన్నాయి. 7 వేల 669 కిలోమీటర్లు అధ్వానంగా మారాయి. గుంతలు పూడిస్తే వాహనాలు సాఫీగా వెళ్లే రోడ్లు 8 వేల 658 కిలోమీటర్లు ఉన్నాయి. మొత్తంగా 25 వేల 413 కిలోమీటర్ల మేర రహదారులను వెంటనే బాగుచేయాలి. రోడ్డు వేసిన ఐదేళ్ల తర్వాత దానిపై లేయర్ తొలగించాలి. మళ్లీ దానిపై తారు వేసి పునరుద్ధరించాలి. రాష్ట్రంలో ఏటా సగటున 7 నుంచి 8 వేల కిలోమీటర్ల రహదారులను ఇలా పునరుద్ధరించాలి.
జగన్ ప్రభుత్వం ఒక్క ఏడాదే 7 వేల 600 కిలోమీటర్లు రెన్యువల్స్ చేసి చేతులు దులిపేసుకుంది. రాయలసీమ వంటి జిల్లాల్లో కొన్ని రోడ్లు పదేళ్లకు పైగా బాగుంటాయి. ఆ తర్వాత అవి పాడైతే రెన్యువల్ చేయాలి. ఇలా పదేళ్లకు పైగా రెన్యువల్ చేయాల్సిన రోడ్లు 13 వేల 908 కిలోమీటర్లు, పదేళ్లలోపు రెన్యువల్ చేయాల్సిన రోడ్లు 16 వేల 879 కిలోమీటర్లు ఉన్నాయి. రెన్యువల్స్‌కే దాదాపు 7 వేల 512 కోట్లు అవసరమన్నది ఇంజినీర్ల అంచనా. గోదావరి జిల్లాలు, నల్లరేగడి భూములున్నచోట కాల్వలు, నదుల వెంబడి ఉండే రోడ్లు త్వరగా దెబ్బతింటాయి. ఇలాంటి వాటిని పటిష్ఠపరచాలి. ఐదేళ్లూ పట్టించుకోకపోవడంతో 6 వేల 439 కిలోమీటర్లు ఇప్పుడు పటిష్ఠపరచాలి. వీటికి 4 వేల 428 కోట్లు వ్యయమవుతుంది.
విజయవాడ బైపాస్ రోడ్డు నిర్మాణంలో జాప్యం - ఇంకా మోక్షం ఎప్పుడో? - Vijayawada West Bypass Road
వాహనరద్దీ పెరిగిన రోడ్ల విస్తరణకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంగళం పాడింది. గత ప్రభుత్వాలు ప్లాన్‌వర్క్స్ కింద ఏటా బడ్జెట్‌లో నిధులు కేటాయించి, విస్తరణ పనులు చేసేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అసలు ప్లాన్‌వర్క్స్ ఊసే మరచిపోయింది. దీంతో విస్తరించాల్సిన రోడ్ల సంఖ్య భారీగా పెరిగింది. కార్లు, బస్సులు తదితర వాహనాలను ఇంజినీర్లు పాసింజర్ కార్ యూనిట్స్‌గా పరిగణిస్తారు. రాష్ట్రంలో నిత్యం 2 నుంచి 10 వేల పీసీయూ (PCU)ల వాహనరద్దీ ఉన్న 21 వేల 276 కిలోమీటర్లను 7 మీటర్ల మేర రెండు వరుసలుగా విస్తరించాలి. 10 నుంచి 15 వేల పీసీయూల వాహనరద్దీ ఉన్న 2 వేల 600 కిలోమీటర్లను 10 మీటర్ల వెడల్పుతో విస్తరించాలి. రోజూ 15వేల పీసీయూల పైనే వాహనాల రాకపోకలు ఉన్న 16 వందల కిలోమీటర్లను నాలుగు వరుసలుగా విస్తరించాలి. ఒక వరసతో 5.5 మీటర్ల వెడల్పుతో ఉన్న రోడ్లలో 7 వేల 628 కిలోమీటర్లను 7 మీటర్ల మేర రెండు వరుసలుగా, వెయ్యీ 18 కిలో మీటర్లు 10 మీటర్ల మేర, 673 కిలోమీటర్లు నాలుగు వరుసలుతో విస్తరించాలి. మొత్తంగా రోడ్ల విస్తరణకే 21 వేల 132 కోట్లు అవసరం. వెయ్యి కిలోమీటర్ల గ్రామీణ మట్టిరోడ్లను తారురోడ్లుగా మార్చేందుకు మరో 12 వందల కోట్లు కావాలి.
మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్‌రోడ్డుకు గ్రహణం - వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు
రాష్ట్రంలో శిథిలమైన వంతెనలనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో అనేక వంతెనలు కూలిపోగా, మరికొన్ని కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో 224 ప్రధాన వంతెనలు, 502 చిన్న వంతెనలు పునర్నిర్మించాలి. అత్యవసరంగా 288 వంతెనలకు నిర్వహణ పనులు చేయాలి. 611 శ్లాబ్ కల్వర్టులు, 13 వందల 67 పైప్ కల్వర్టులు, 107 కాజ్‌వేలకు పూర్తిస్థాయిలో మరమ్మతులు గానీ, పునర్నిర్మాణం కానీ చేయాలి. అన్ని రకాల వంతెనల పనులకు 5 వేల 460 కోట్లు అవసరం.
రోడ్డు లేని కారణంగా నిలిచిన అంబులెన్స్ - మధ్యలోనే గర్భిణీ ప్రసవం - WOMAN DELIVERY ON ROAD