CM Jagan Meeting with Industrialists in Visakha: జగన్ ప్రభుత్వంపై నమ్మకం లేక చాలామంది పారిశ్రామికవేత్తలు రాష్ట్రాన్ని వదిలిపోతున్నా పట్టించుకోలేదు. క్రమం తప్పకుండా ప్రోత్సాహకాలంటూ పారిశ్రామికవేత్తలను నమ్మించి మోసగించారు. కనీసం రాయితీలు ఇవ్వకుండా పరిశ్రమలను దివాలా తీసే స్థితికి నెట్టారు. సాగర తీరంలో ఐటీలో వెలుగులు నింపుతామంటూ చెట్టు ఎక్కించి హామీలను జగన్ గాలికొదిలేశారు.
గతేడాది పెట్టుబడిదారుల సదస్సులో ఏకంగా 13.12 లక్షల కోట్లకు ఎంవోయూలు జరిగాయంటూ బడాయికి పోయారు కానీ వాటిలో కనీసం ఒక్క శాతాన్నీ ఆచరణలోకి తేలేదు. ఐదేళ్లుగా పరిశ్రమలు, ఐటీని పక్కన పెట్టేసి ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ నేడు 'విజన్ విశాఖ' పేరుతో వివిధ రంగాల వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో సమావేశం ఏర్పాటు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
'ప్రభుత్వం ఒప్పందం చేసుకునే ప్రతి రూపాయి, ప్రజలకు చెప్పే ప్రతి లెక్కా రాష్ట్రంలో పెట్టుబడుల రూపంలో కార్యరూపం దాల్చితేనే చెబుతాం తప్ప కేవలం గణాంకాలకు, గొప్పలకు పెట్టుబడుల సదస్సును వినియోగించుకోం' అంటూ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్(IT Minister Gudiwada Amarnath) గతేడాది మార్చి 3,4 తేదీల్లో జరిగిన పెట్టుబడుల సదస్సులో చెప్పిన ఈ మాటలకు, తర్వాత వచ్చిన పరిశ్రమలకు పొంతనే లేదు.
18 రంగాలు, 386 ఎంవోయూలు, రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు, 6 లక్షల ఉద్యోగాల కల్పన అంటూ జగన్ సర్కారు(YSRCP Govt) గొప్పలు చెప్పింది. వీటిలో పర్యాటక శాఖలో అత్యధికంగా 117, పరిశ్రమలు-వాణిజ్య శాఖలు 99, ఐటీ-ఎలక్ట్రానిక్స్‌లో 86 ఒప్పందాలు జరిగాయంది. క్షేత్రస్థాయిలో 3 వేల 58 కోట్ల విలువైన 0.23 శాతం ఒప్పందాలే వాస్తవ రూపం దాల్చాయి. పర్యాటకశాఖకు 22 వేల కోట్లకు పైగా పెట్టుబడులని ఢంకా మోగించారు.
విశాఖలో రెండే రెండు ప్రాజెక్టులకు అవీ ఆపసోపాలతో అడుగులు పడ్డాయి. భీమిలి వద్ద అన్నవరం పరిధిలో ఒబెరాయ్ హోటల్‌కు శంకుస్థాపన చేశారు. మరో హోటల్‌కు భీమిలి పరిధిలోనే భూకేటాయింపులు జరిగాయి. సదస్సు తర్వాత ఐటీలో మార్పులేమీ రాలేదు. ఇన్ఫోసిస్ కంపెనీ వర్క్ ఫ్రం హోం నుంచి ఉద్యోగులను కార్యాలయాలకు తీసుకొచ్చేందుకు వెయ్యి మంది సామర్థ్యంతో ఒక శాఖను ఐటీ హిల్స్‌లో ప్రారంభించింది. కనీసం దానికి భవనం కేటాయించని ప్రభుత్వం ఇదంతా తన గొప్పే అన్నట్లు ఖాతాలో వేసేసుకుంది.
2030లోపు తమిళనాడు ఎకానమీ ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలన్న లక్ష్యంలో భాగంగా ఈ ఏడాది జనవరి 9న 6.64 లక్షల కోట్ల పెట్టుబడులు, 26 లక్షల ఉద్యోగాల కల్పనకు 631 ఎంవోయూలు చేసుకున్నారు. పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికల అమలుకు వారం క్రితం తమిళనాడు ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. విశాఖ సదస్సులో జరిగిన ఎంవోయూలు కార్యరూపం దాల్చేలా ప్రతివారం ఉన్నతస్థాయి కమిటీతో సమీక్షిస్తామన్న ప్రభుత్వం దాన్ని కంటితుడుపుగా మార్చేశారు.
ఎన్నికల అక్రమాలకు అడ్డాగా మారిన తిరుపతి- ముగ్గురు వైసీపీ జగజ్జంత్రీలదే హవా
అందుకే కొత్త కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడంలేదన్న విమర్శలున్నాయి. ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు తెలుసుకుని, అవి అనుకూలంగా ఉన్నాయనుకుంటేనే ఎవరైనా పెట్టుబడులు పెడతారు. విచిత్రంగా విశాఖలో సమ్మిట్ సమయానికి ఏపీ పారిశ్రామిక విధానం ప్రకటించకుండానే పెట్టబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకొచ్చేశాయని చెప్పారు. ప్రభుత్వం వారికి ఏం హామీలిచ్చింది? ఎలాంటి రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించిందో ఎవరికీ తెలియదు.
సూక్ష్మ, చిన్న పరిశ్రమల్లో ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలు తమ మార్జిన్ మనీతోపాటు, బ్యాంకు రుణాలు తెచ్చి పరిశ్రమలు పెడతారు. ఆరు నెలల వ్యవధిలోనే ప్రభుత్వం ప్రోత్సాహకాలు, రాయితీలు విడుదల చేయగలిగితే రుణాలకు సంబంధించి ఈఎంఐ(EMI)ల భారం తగ్గిపోతుంది. మూడేళ్లుగా ఆటోనగర్ ప్రోత్సాహకాలు 7 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో చిన్నపారిశ్రామికవేత్తలు అప్పులతో కుదేలయిపోయారు.
ఇప్పుడు ప్రోత్సాహకాలిచ్చినా అప్పులకే చాలవు. విశాఖ ఆటోనగర్‌లో 3 వేల 400 వరకు పరిశ్రమలున్నాయి. విశాఖ, అనకాపల్లి పరిధిలో ఎంఎస్‌ఎంఈ యూనిట్ల ప్రోత్సాహకాలు, రీస్టార్ట్ కింద సుమారు రూ.20 కోట్లకు పైగా బకాయిలున్నాయి. ఆటోనగర్‌లో అపెరల్ పార్కు ఏర్పాటు చేసి, చేతులు దులిపేసుకున్నారు. అక్కడ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు లేవు. నైపుణ్య శిక్షణ ఇచ్చేలా చూస్తే బాగుంటుందని పారిశ్రామికవేత్తలు విన్నవిస్తున్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నికల కోడ్ వస్తున్న వేళ పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టు నైపుణ్య శిక్షణ ఇచ్చేలా 'భవిత' పేరుతో వ్యవస్థకు శ్రీకారం చుట్టడం ముక్కున వేలేసుకునేలా ఉంది.
వాలంటీర్లను తొలగించం- వివేక హత్యపై పూటకోమాట! చర్చకు సిద్దమా ?: చంద్రబాబు
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విశాఖలో వెలవెలబోతోంది. ఐటీ రంగానికి రాయితీలు, ప్రోత్సాహకాలు కరవయ్యాయి. సుమారు 100 కోట్ల వరకు బకాయిలున్నాయి. మొదటి విడతగా 25 కోట్లు విడుదల చేయడానికి ఎన్నికల కోడ్ అని, సమ్మిట్ తర్వాత చెల్లిస్తామని ఐటీ మంత్రి అమర్‌నాథ్ కాకమ్మ కథలు చెప్పారు. దీనిపై కొన్ని కంపెనీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, 8 వారాల్లో చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటి వరకు చెల్లించకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసూ దాఖలయింది.
చంద్రబాబు హయాంలో డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్కు పాలసీ ఉండేది. భవనాలను సగం అద్దెకే ఇవ్వడంతోపాటు, ఇంటర్నెట్, నిరంతర విద్యుత్ సౌకర్యం కల్పించేవారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఈ పాలసీని ఎత్తేయడంతో చిన్న, మధ్యతరహా కంపెనీలు దాదాపు వంద వరకు మూతపడిపోయాయి. స్టార్టప్ విలేజ్ మూడేళ్లు ఖాళీగా పెట్టి ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. కొవిడ్ సమయంలో కంపెనీలకు విద్యుత్ ఎండీ ఛార్జీ, ప్రాపర్టీ ఛార్జీలు రద్దు చేస్తామని స్వయానా సీఎం ప్రకటించినా ఇంత వరకు అమలు కాలేదు.