Poola Subbaiah Veligonda Project : వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నిర్వాసితులకు న్యాయం చేశాకే నల్లమల సాగర్‌కు నీళ్లు నింపి మళ్లీ ఓట్లడుగుతామని ప్రకాశం జిల్లాలో ఎక్కడ సభ పెట్టినా ప్రతిపక్ష హోదాలో జగన్ గొంతు చించుకున్నారు. కానీ ఐదేళ్లలో ప్రాజెక్టు పూర్తి కాలేదు. చుక్క నీరు కూడా బయటకు వచ్చే అవకాశం లేదు. తీరా ఎన్నికల వేళ సొరంగాల ప్రారంభమంటూ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నామంటూ సీఎం జగన్ హడావుడి చేస్తున్నారు. శిలాఫలకాలు ఏర్పాటు చేసి అసత్య ప్రచారానికి తెర లేపారు. హెడ్ రెగ్యులేటర్, ఫీడర్ ఛానల్, నల్లమల రిజర్వాయర్‌లో కొన్ని పనులు, మేజర్, మైనర్ కాలువలు వంటి సివిల్ ఇంకా చాలా పనులు మిగిలే ఉన్నాయి. వీటన్నింటికీ మించి నిర్వాసితులకు ఇంతవరకు ఆర్ అండ్ ప్యాకేజీ ఇవ్వలేదు. ఇవేమీ పట్టించుకోకుండా ముఖ్యమంత్రి జగన్ చెర్లోపల్లి వద్ద రెండో సొరంగం ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యారు.
CM Jagan Inaugurates to Unfinished Projects : నల్లమల కొండల శ్రేణుల్లోని మూడు ఖాళీల్లో కాంక్రీట్ డ్యాంలు నిర్మించి నల్లమల సాగర్ ఏర్పాటు చేశారు. శ్రీశైలంలోని కృష్ణా జలాలను తరలించేందుకు భూగర్భంలో దోర్నాల మండలం కొత్తూరు నుంచి కృష్ణానదిలోని కొల్లంవాగు వరకు రెండు సమాంతర సొరంగాలను తవ్వాల్సివచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం ఒక సొరంగానివి 90 శాతం పనులు, రెండో దానివి 60 శాతం పనులు పూర్తి చేసింది. జగన్ సర్కార్ వచ్చాక ఐదేళ్లలో మొదటి సొరంగంలో చివరి దశ పనులు, రెండో సొరంగంలో 40 శాతం పనులు మాత్రమే పూర్తి చేసింది. ఆ పనుల్లోనూ ఒక కిలోమీటర్ మేర టీడీఎమ్తో కాకుండా మాన్యువల్‌గా చేశారు.
సీఎం జగన్ ప్రారంభించి వెళ్లక ముందే ఇలా పెచ్చులూడిపోయాయి- నాసిరకం పనులపై ఆగ్రహావేశాలు
తొలి సొరంగం నుంచి రెండో సొరంగంలోకి ఆరు చోట్ల అడ్డదారులు తవ్వారు. ఇందుకు అనుమతులు లేకున్నా మందుగుండు సామగ్రి వినియోగించారు. వ్యర్ధాలను టిప్పర్ల ద్వారా మొదటి, రెండో సొరంగాల నుంచి బయటికి తెచ్చారు. అధిక బరువుతో టిప్పర్లు తిరగడంతో సొరంగాలు దెబ్బతినే అవకాశం ఉందని ఇంజినీరింగ్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాన్యవల్‌గా తవ్విన వీటిలో ఇంకా కాంక్రీట్ లైనింగ్ చేయాల్సి ఉంది. ఫీడర్ ఛానల్‌కు వేసిన మట్టి కట్టకు ఎక్కడ పడితే అక్కడ గండ్లు పడ్డాయి. కనీసం మట్టి వేసి సరిచేయలేదు. కాలువ వదిలితే ప్రారంభ దశలోనే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది.
మరోవైపు ఫీడర్ కాలువ పటిష్ఠం చేయడంతో పాటు నిర్వాసితులను ముంపు గ్రామాల నుంచి ఖాళీ చేయించాల్సి ఉంది. అయితే ఇంతవరకు ప్రభుత్వం వారికి పరిహారం అందించలేదు. పునరావాసం కల్పించకుండా ప్రాజెక్టు ప్రారంభిస్తే తమ బతుకులు ఏం కావాలని ముంపు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జగన్ ఉత్తుత్తి ప్రారంభోత్సవాలను ప్రజలు నమ్మరు: కందుల నారాయణరెడ్డి
మరోవైపు సీఎం పర్యటనకు ఒక రోజు ముందే ముంపు గ్రామాల్లో పోలీసులు మోహరించారు. సీఎం పర్యటనలో ఎవరైనా అడ్డుకోవాలని, వినతులివ్వడానికి ప్రయత్నించినా కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. పెద్దారవీడు, మార్కాపురం అర్థవీడు మండలాల్లోని పదకొండు ముంపు గ్రామాల్లో క్రియాశీలకంగా ఉండే ప్రతిపక్ష నాయకులపై నిఘా పెట్టారు. వంద మందికి పైగా నిర్వాసితులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ నోటీసులపై సంతకాలు చేయించుకున్నారు.
'అసంపూర్తి ప్రాజెక్టును జాతికి ఎలా అంకితం చేస్తారు? - వెలిగొండ పూర్యయ్యే వరకు బీజేపీ పోరాటం'