CM Jagan Bus Yatra Traffic Diversions: తిరుపతి జిల్లా నాయుడుపేట సమీపంలో ఈరోజు సాయంత్రం తలపెట్టిన మేమంతా సిద్ధం సభతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. ఆర్టీసీ బస్సులు రాక వృద్దులు, మహిళలు, చిన్నారులు తిప్పలు పడాల్సి వస్తోంది. ప్రైవేటు వాహనాలు ఏర్పాటు చేసుకుని ఎండలో తంటాలు పడుతున్నారు.
తిరుపతి జిల్లాలో సీఎం జగన్ బస్సుయాత్ర సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించారు. రేణిగుంట నుంచి నాయుడుపేటకు వెళ్లే ప్రధాన రహదారులను అధికారులు నిర్బంధించారు. శ్రీకాళహస్తి నుంచి తిరుపతికి వెళ్లే వాహనాలను మేలపాక వైపు మళ్లించి, మన సముద్రం, పాపా నాయుడుపేట గ్రామాల మీదుగా వాహనాలను పంపించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు లేకపోవడంతో రోడ్లపై ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వచ్చింది.
అదే విధంగా నెల్లూరు నుంచి తిరుపతి వెళ్లే వాహనాలను నాయుడుపేట మీదుగా కాకుండా గూడూరు వెంకటగిరిల మీదుగా వెళ్లేలా మళ్లించారు. నెల్లూరు నుంచి చెన్నై వెళ్లే వాహనాలను గ్రామీణ ప్రాంతాల మీదుగా మళ్లించారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచి వాహనదారులు తిప్పలు పడుతున్నారు. మరోవైపు జాతీయ రహదారిపై భారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.
మరోవైపు జాతీయ రహదారిపై వాహనాలను ఎక్కడిక్కడ నిలిపివేయడంతో ఉక్కపోత భరించలేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులు తిరగకపోవడంతో పాఠశాల నుంచి ఇంటికి వెళ్లే విద్యార్థులు తీవ్ర అవస్థులు పడుతున్నారు. వాహనాలను వెళ్లనీయకుండా పోలీసులు ఎక్కడిక్కడ కట్టడి చేస్తున్నారు.
వైసీపీ నేతల దాడి: సీఎం బస్సు యాత్రకు గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలను మభ్యపెట్టి బలవంతంగా తీసుకొచ్చారు. ఏర్పేడు, శ్రీకాళహస్తి పట్టణంలోని ఏపీ సీడ్స్ కూడలిలో జగన్ కోసం కార్యకర్తలు స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు. సిద్ధం సభలో ప్రజలను ముప్పు తిప్పలు పెట్టిన జగన్, ఇప్పుడు బస్సు యాత్రతో కూడా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తీవ్ర అసహనానికి గురవుతున్నారు. తొట్టంబేడు మండలంలో డ్రోన్ కెమెరాను ఎగుర వేస్తున్న కొందరి వ్యక్తులపై వైసీపీ నేతలు దాడి చేసి, అదుపులోకి తీసుకున్నారు.