Chandrababu Tweet on Palle Panduga : గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిర్దేశించిన పల్లె పండుగ కార్యక్రమం విజయవంతంగా సాగుతుండటం ఆనందాన్ని కలిగిస్తోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 13,326 గ్రామాల్లో మొత్తం 30,000 పనులు చేపట్టాలనే బృహత్ సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఆయన అభినందించారు. రూ.4500 కోట్ల ఖర్చుతో చేస్తున్న అభివృద్ధి పనులు గ్రామాల్లో ఉపాధిని కల్పించడమే కాక అక్కడ మళ్లీ వెలుగులు తెస్తున్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపట్టి పల్లెల్లో సంతోషాలు నింపేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎక్స్ వేదికగా చంద్రబాబు ప్రకటించారు.
గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిర్దేశించిన ‘పల్లె పండుగ’ కార్యక్రమం విజయవంతంగా సాగుతుండటం ఆనందం కలిగిస్తోంది. రాష్ట్రంలోని 13,326 గ్రామాలలో మొత్తం 30 వేల పనులు చేపట్టాలనే బృహత్ సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan కు ఈ… pic.twitter.com/9yAc5xtSW9
— N Chandrababu Naidu (@ncbn) October 15, 2024
Palle Panduga Program in AP : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ పంచాయతీల్లో మౌలిక సదుపాయాల మెరుగుపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ వారోత్సవాలకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం సోమవారం నుంచి ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 20 వరకు గ్రామ పంచాయతీల్లో అన్ని రకాల పనులకు భూమిపూజ చేయనున్నారు. పల్లె పండుగలో భాగంగా దాదాపు రూ.4,500 కోట్లతో 30,000 పనులను సర్కార్ చేపట్టనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 3,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 65,000 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు, 25,000 నీటి కుంటలు, 25,000 గోకులాలను నిర్మించనున్నారు. అలాగే 30,000 ఎకరాల్లో నీటి నిల్వకు ఉపయోగపడే కందకాలు తవ్వాలని నిర్ణయించారు.
ఇప్పటికే 200 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 50 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 53,257 ఎకరాల్లో హార్టికల్చర్, 11,512 ఫార్మ్ పాండ్లు, 1900 గోకులాలు, 20,145 ఎకరాలలో ట్రెంచులు పూర్తి చేశారు. మిగతా పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయనున్నారు. పల్లెపండుగ వారోత్సవాల్లో ఉపాధి హామీ పనుల ఉపయోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ప్రతి గ్రామ పంచాయతీలో 2024-25 సంవత్సరంలో చేపట్టబోయే పనులు, పూర్తి చేసిన పనుల వివరాలు తెలియపరిచే సిటిజెన్ నాలెడ్జ్ బోర్డు ఏర్పాటు చేయనున్నారు. సంక్రాంతి నాటికి అన్ని పనులు పూర్తిచేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.
సంక్రాంతికి 'పల్లె' కళకళలాడాలి - చంద్రబాబు అనుభవం మాకు ఎంతో బలం: పవన్ కల్యాణ్