CM Chandrababu on Graduate MLC Election: అందరూ కలిసి కట్టుగా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే గెలుపును శాశ్వతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. 2029లోనూ మళ్లీ ఎన్డీయే గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే పని చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలబెట్టాలని సూచించారు. ప్రతి పట్టభద్రుడూ ఓటు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పట్టభద్రుల ఓట్ల నమోదుకు వచ్చే నెల 6వ తేదీ చివరి రోజైనందున, ఆ లోపు ఓటర్ల నమోదును పూర్తి చేయాలని నేతలను ఆదేశించారు. రాష్ట్రాభివృద్ధి కోసం రేయింబవళ్లు కష్టపడి పని చేస్తున్న అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
జనసేన, బీజేపీల సమన్వయంతో: ఉమ్మడి తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలతో తెలుగుదేశం అధినేత, సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వంలో ఉండి పనులు చేయడం ఎంత ముఖ్యమో, ఆ పనుల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం కూడా అంతే ముఖ్యమని వెల్లడించారు. ఎన్డీయే అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జనసేన, బీజేపీలతో సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. తూర్పుగోదావరి - పశ్చిమ గోదావరి పట్టభద్రుల ఎన్నికల అభ్యర్ధిగా పేరాబత్తుల రాజశేఖర్, గుంటూరు - కృష్ణా జిల్లాల అభ్యర్ధిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను ఎన్డీయే తరఫున ఇప్పటికే ప్రకటించామని గుర్తు చేశారు.
"మంచి పనులు కూడా చెప్పుకోలేకపోతే ఎలా?" - పలువురు మంత్రులకు చంద్రబాబు క్లాస్
పాలసీలు, పథకాలపై చర్చ జరగాలి: ప్రతి నియోజకవర్గంలో మూడు పార్టీల నేతలతో కో ఆర్డినేషన్ మీటింగ్‌లు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. మూడు పార్టీలు కలిసి పని చేయడం వల్ల మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 93 శాతం సీట్లు సాధించామని స్పష్టం చేశారు. కేంద్ర కేబినెట్ అమరావతి రైల్వే లైనుకు ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. 4 వేల 300 కోట్లతో గ్రామాల్లో అభివృద్ధి పనులను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభించారన్నారు. నాలుగు నెలల్లో అమలు చేసిన పథకాలు, తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. ప్రజల కోసం తీసుకొచ్చిన పాలసీలు, పథకాలపై చర్చ జరగాలన్నారు.
మండలాల వారీగా ఎన్డీయే సమన్వయ కమిటీలు: ఇప్పటికే డీఎస్సీ ప్రకటించామని, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను తీసుకొచ్చేందుకు 6 పాలసీలు తీసుకొచ్చామని తెలిపారు. నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని జాబ్ ఫస్ట్ విధానంతో ఉద్యోగ కల్పనకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు అడుగులు ముందుకేస్తున్నామని పేర్కొన్నారు. ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నామన్నారు. దేశం, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పని చేయాలని స్పష్టం చేశారు. మండలాల వారీగా ఎన్డీయే కో-ఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేసుకొని ముందుకెళ్లాలన్నారు.
తల్లి, చెల్లిని రోడ్డుపైకి లాగారు - జగన్‌లాంటి వ్యక్తులతో రాజకీయాలు చేస్తాననుకోలేదు: చంద్రబాబు