CM Chandrababu Serious on Minister Wife Issue : రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భార్య హరిత పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలంలో పింఛన్ల పంపిణీకి బయల్దేరిన ఆమె, ఇటీవల ఎన్నికల ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసుల ఎస్కార్ట్ కోసం వేచి చూశారు.
గత ఐదేళ్లూ వైఎస్సార్సీపీకి తొత్తులా పనిచేశారని ఆరోపణలు ఎదుర్కొన్న రాయచోటి ఎస్సై అరగంట తర్వాత అక్కడికి రావడంతో ఎంతసేపు నిరీక్షించాలంటూ హరిత అసహనం వ్యక్తంచేశారు. మీకోసం ఎంతసేపు నిరీక్షించాలని మండిపడ్డారు. కాన్ఫరెన్స్ ఉందని చెప్పడంతో సీఐకి లేని కాన్ఫరెన్స్ మీకెందుకని అసహనం వ్యక్తం చేశారు. మీకు జీతం ఇస్తుంది ప్రభుత్వమా లేక వైఎస్సార్సీపీ నాయకులు ఇస్తున్నారా అని ఎస్ఐని నిలదీశారు.
సారీ చెప్పడంతో ఎందుకు సారీ అంటూ విసుక్కున్నారు. అనంతరం ఆమె పింఛన్ల పంపిణీకి చిన్నమండెం మండలానికి వెళ్లారు. మంత్రి భార్య హరిత అసహనం వ్యక్తం చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీనిపై వెంటనే మంత్రి కార్యాలయం స్పందించింది. పోలీసులు ఆలస్యంగా రావడం వల్లే మంత్రి భార్య అసహనం వ్యక్తం చేశారని, ఏమైనా గొడవలు జరుగుతాయని కారణంతోనే ఎస్కార్ట్ కోసం మంత్రి సతీమణి వేసి చూశారని వివరణ ఇచ్చుకున్నారు.
AP Minister Wife Issue : పోలీసులతో రాష్ట్ర రవాణా శాఖా మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి ప్రవర్తించిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులతో మంత్రి భార్య హరితా రెడ్డి మాట్లాడిన తీరును సీఎం తప్పుబట్టారు. ఘటన తన దృష్టికి రావడంతో మంత్రితో ఫోన్‌లో మాట్లాడిన సీఎం వివరణ కోరారు.
అధికారులు, ఉద్యోగుల పట్ల అంతా గౌరవంగా మసలుకోవాలని, ఇలాంటి వైఖరిని సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఏ స్థాయి వారు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. ఘటనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి, ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటానని చంద్రబాబుకు వివరణ ఇచ్చుకున్నారు.