CM Chandrababu Review on Jaljeevan Mission: గ్రామీణ నీటి సరఫరా, జల్‌జీవన్ మిషన్ పథకాలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 26 జిల్లాల్లో 95.44 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్ల ద్వారా నీటిని అందించాల్సి ఉందని ఇందులో 2019 ఆగస్టుకు ముందే 31.68 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. 2019-24 మధ్య గత ప్రభుత్వ హయాంలో 39.30 లక్షల కనెక్షన్లు మాత్రమే ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
వైఎస్సార్సీపీ హయాంలో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని ఫలితంగా 5 జిల్లాల్లో మాత్రమే 90 శాతానికి పైగా కుళాయి కనెక్షన్లు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ప్రతి ఇంటికి సురక్షిత నీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అన్నారు. కేంద్రం ఇచ్చిన 27 వేల 248 కోట్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం 4 వేల 235 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని ఇంకా 28 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందన్నారు.
జల్‌జీవన్ మిషన్ పథకాన్ని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళతో పాటు పలు రాష్ట్రాలు బ్రహ్మాండంగా వినియోగించుకున్నాయని చంద్రబాబు తెలిపారు. 2019 కంటే ముందే నిర్మితమై ఉన్న ట్యాంకుల ద్వారా కనెక్షన్లు ఏర్పాటు చేసి నీటి సరఫరా చేశామని తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సురక్షితమైన తాగు నీటిని ప్రతీ ఇంటికీ నిరంతరం అందించేందుకు గ్రామాలకు పైప్‌లైన్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. శాశ్వత ప్రాతిపదికన 95 లక్షల గృహాలకు తాగునీటిని అందించేలా డీపీఆర్లు సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించారు.
లీకేజీలను అరికట్టేందుకు వీలుగా స్కాడా లాంటి సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు. పురోగతి లేని పనుల టెండర్లు రద్దు చేయాలన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్ది కేంద్రాన్ని మరోమారు విజ్ఞప్తి చేసి నిధులు తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పనులు చేసే కాంట్రాక్టరు వినియోగించే మెటీరియల్ నాణ్యతపైనా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. జల్‌జీవన్ మిషన్ పనులు మరో 3 నెలల్లో పట్టాలెక్కించి పరుగులు పెట్టించాలని ఆదేశించారు.
ప్రకాశం బ్యారేజీ రెండవ పవడ తొలగింపు- మూడో దానికి ముహూర్తం ఎప్పుడో! - 2nd Boat Removed at Prakasam