Chandrababu Vijayawada Tour : వరద ముంపు ప్రాంతాల్లో దాదాపు నాలుగు గంటల పాటు నిర్విరామంగా పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్‌లో మంత్రులు, ఉన్నతాధికారులతో మరోమారు సమీక్ష నిర్వహించారు. అంబాపురంలో ఒక కుటుంబం వద్దకు వెళ్లినప్పుడు పిల్లలకు మంచినీరు కూడా అందించలేని పరిస్థితిని చూశానని చెప్పారు. క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు తాగటానికి నీళ్లు లేవంటూ ఎక్కువ మంది నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు.
CM Chandrababu Tour On JCB : నేటి నుంచి మరిన్ని వాటర్ బాటిళ్లు పంపిణీ చేస్తామని చంద్రబాబు చెప్పారు. ట్యాంకర్లతో నీళ్లు సరఫరా ప్రారంభిస్తామన్నారు. ఈ సాయంత్రానికి అన్ని రక్షిత తాగునీటి పథకాల నుంచి నీళ్లు విడుదల చేస్తామని వెల్లడించారు. ప్రతి వార్డులో వెయ్యి కుటుంబాలకు ఒకరిని నియమిస్తామని తెలిపారు. వారికి సెల్‌ఫోన్ ఇచ్చి అందరికీ ఆహారం సరఫరా అయిందో లేదో తెలుసుకుంటామని చంద్రబాబు వివరించారు.
అగ్నిమాపక శకటాల్ని తెప్పిస్తున్నాం : వరదలో మునిగి ద్విచక్రవాహనాలు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలు పాడయ్యాయని చంద్రబాబు చెప్పారు. బీమా చెల్లింపుపై బుధ, గురువారాల్లో బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ముంపు బారిన పడ్డ నివాసాలను శుభ్రపరిచే బాధ్యతల్ని అగ్నిమాపక శాఖకు అప్పగించామని తెలిపారు. అన్ని ప్రాంతాల నుంచి అగ్నిమాపక శకటాల్ని తెప్పిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.
నేటి నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్యశిబిరాలు నిర్వహిస్తామని చంద్రబాబు వెల్లడించారు. వైరల్ జ్వరాలు వచ్చే ప్రమాదం పొంచి ఉన్నందున ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అనే విషయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తామని చెప్పారు. వరద బాధితులకు ఇచ్చే ఆహారాన్ని విసరడంతో కొంత నీటిలో పడుతుందోందని అది సరికాదని వ్యాఖ్యానించారు. బాధితులు దాన్ని తీసుకుని తినడం వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. పండ్లు, నీరు, ఆహారాన్ని గౌరవప్రదంగా చేతికి అందించాలని చంద్రబాబు కోరారు.
"తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విజయవాడకు వరదనీటి నిర్వహణ ప్రణాళికలు రూపొందించాం. గత సర్కార్‌లో పక్కన పడేసిన వాటిని మళ్లీ అమలు చేస్తాం. బుడమేరు వరద సింగ్‌నగర్ మీదకు రాకుండా కొల్లేరు, వీటీపీఎస్ నుంచి కృష్ణానది పంపేందుకు ఉన్న అడ్డంకుల్ని తొలగిస్తాం. భవిష్యత్‌లో విజయవాడకు మరోసారి ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇస్తున్నాను." - చంద్రబాబు, ముఖ్యమంత్రి
Vijayawada Floods Updates : కేంద్రం సాయం కోరుతూ నివేదిక తయారు చేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ఇవాళ, రేపటి కల్లా ముంపు బారిన పడ్డ చివరి ప్రాంతాలకు విద్యుత్ పునరుద్ధరిస్తామన్నారు. వరద సహాయ చర్యల్లో భాగంగా మరణించిన లైన్‌మెన్ కుటుంబానికి విద్యుత్తుశాఖ తరపున 20లక్షలు, ప్రభుత్వం నుంచి 10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. వరద బాధితుల్ని ఆదుకునేందుకు చాలా మంది ముందుకొస్తున్నారన్న సీఎం పేర్కొన్నారు.
సీఎం రిలీఫ్‌ఫండ్‌కు సాయం చేసేందుకు డిజిటల్ పేమెంట్, క్యూఆర్ కోడ్ విధానం కూడా అందుబాటులోకి తెచ్చామని చంద్రబాబు వివరించారు. విరాళాలు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతోందని దీనిపై ఇవాళ, రేపట్లో స్పష్టత వస్తుందని వెల్లడించారు. మృతదేహాలను మహాప్రస్థానం వాహనాల్లో తెచ్చి పోస్ట్‌మార్టం చేసి కుటుంబాలకు అప్పగించమని ఆదేశాలిచ్చాని పేర్కొన్నారు. చనిపోయిన పశువుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుని ఖననం చేస్తామని చంద్రబాబు చెప్పారు.
ధైర్యంగా ఉండండి - అందరినీ ఆదుకుంటామని వరద బాధితులకు చంద్రబాబు హామీ - Chandrababu Tour in Vijayawada
వరద బాధితులను ఆదుకోవడమే లక్ష్యం- ఆపద సమయంలో కుట్రలా? : చంద్రబాబు - CM review flood relief measures