CM Chandrababu Delhi Tour : అమరావతికి ప్రపంచబ్యాంకు ద్వారా నిధులు సమకూర్చడానికి, పోలవరం తొలిదశ పనులు పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి కూడా పచ్చజెండా ఊపింది. డిసెంబర్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా విశాఖలో శంకుస్థాపన జరగనుంది. ఈ మేరకు ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీకి చెందిన ఎన్డీయే కూటమి ఎంపీలకు చెప్పారు.
కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం సీఎం చంద్రబాబు దిల్లీ వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయన ప్రధాని మోదీని కలిసి అమరావతి, పోలవరం నిర్మాణాలకు కేంద్ర సాయం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం, ఇటీవలి వరదల కారణంగా జరిగిన నష్టాన్ని సరిదిద్దడానికి కేంద్ర సాయం గురించి చర్చించారు. కేంద్ర ప్రభుత్వ వికసిత భారత్-2047 విజన్‌కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడానికి ఆంధ్రా-2047 విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామని ప్రధానికి చంద్రబాబు వివరించారు.
Chandrababu Meet PM Modi : 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్ల స్థాయికి, తలసరి ఆదాయాన్ని 43,000ల డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు ప్రధానికి వివరించారు. ఈ లక్ష్య సాధన కోసం కేంద్రం నుంచి సహాయ, సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి అతి ముఖ్యమైన జాతీయ రహదారుల ప్రాజెక్టులను మంజూరు చేయాలని మోదీని చంద్రబాబు కోరారు.
ప్రధానమంత్రి ఉజ్వలయోజనను ఆంధ్రప్రదేశ్‌లో మరింత మందికి విస్తరించేందుకు చేయూత అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అమరావతిలో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు సాయం చేయడానికి ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు రాత్రి సీఎంఓ ప్రకటనలో తెలిపింది. ప్రధానితో సమావేశం ఫలవంతమైందని చంద్రబాబు ఎక్స్ వేదికగా వెల్లడించారు. పోలవరం సవరించిన అంచనాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపానని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిళ్లను అధిగమించేందుకు, అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చినందుకు మోదీకి ధన్యవాదాలు తెలిపినట్లు ముఖ్యమంత్రి వివరించారు.
Chandrababu Meet Ashwini Vaishnav : ప్రధానితో భేటీ అనంతరం రైల్వే, ఎలక్ట్రానిక్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి స్వయంగా దిల్లీలోని సీఎం అధికారిక నివాసానికే వచ్చి చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఏపీలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు. ఐటీ, సెమీకండక్టర్ పరిశ్రమల ఏర్పాటుపైనా సమాలోచనలు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ నైపుణ్యాలు, డిజిటల్ అక్షరాస్యత పెంపొందించడానికి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏర్పాటు చేయాలని అశ్వినీ వైష్ణవ్‌ను ఆయన కోరారు.
స్టార్టప్‌లకు మద్దతివ్వాలి : ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సెమీకండక్టర్ పరిశ్రమలను ఏపీకి రప్పించడానికి అనుకూలమైన వాతావరణం కల్పించాలని చంద్రబాబు తెలిపారు. ఉన్నతశ్రేణి ఉద్యోగాల్లో ఏపీ విద్యార్థుల వాటా పెంచడానికి ఫ్యాబ్రికేషన్ సౌకర్యాలను ఏపీకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. డ్రోన్, సీసీటీవీ టెక్నాలజీలను ప్రోత్సహించేలా స్టార్టప్‌లకు మద్దతివ్వాలని కోరారు. ఏపీలో రైల్వే మౌలిక వసతుల మెరుగుదలపైనా చంద్రబాబు అశ్వినీ వైష్ణవ్‌తో చర్చించారు.
వాల్తేర్ డివిజన్‌ను యథావిధిగా ఉంచుతూనే విభజన చట్టంలో చెప్పిన దక్షిణ కోస్తా రైల్వేజోన్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖ-అమరావతి మధ్య కొత్త రైల్వేలైన్ మంజూరు చేసి రెండేళ్లలోపు పూర్తి చేయాలని కోరారు. మచిలీపట్నం-అమరావతి మధ్య కొత్త లైన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ కోస్తా తీరం అంతటా రైల్వే అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు హౌడా-చెన్నై లైన్ సామర్థ్యం పెంచాలని చంద్రబాబు అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు.
నమో భారత్ కింద విశాఖ-నెల్లూరు మధ్య రైలు అనుసంధానాన్ని మెరుగుపర్చాలని చంద్రబాబు వివరించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి అమరావతికి హైస్పీడ్ రైల్వే కారిడార్లను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. నరసాపురం-మచిలీపట్నం-రేపల్లె- బాపట్ల మధ్య కొత్త రైల్వేలైన్ మంజూరు చేయడం సహా ఈ లింక్‌ను బాపట్ల దగ్గర కోల్‌కతా -చెన్నై లైన్‌తో అనుసంధానించాలని కోరారు. ఈ ప్రతిపాదనలన్నింటిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.
కొత్త రైల్వేజోన్‌కు శంకుస్థాపన : సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కొత్త రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటును ముందుకు తీసుకెళ్తున్నందుకు కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలిపినట్లు చంద్రబాబు ఎక్స్‌లో పేర్కొన్నారు. డిసెంబర్ కల్లా కొత్త రైల్వేజోన్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఏపీలో రైల్వే శాఖ రూ.73,743 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపడుతున్నట్లు రైల్వే మంత్రి చెప్పారని ఆయన వెల్లడించారు. ఇందులో హౌడా-చెన్నై మధ్య నిర్మిస్తున్న 4 వరుసల లైన్ ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్తుందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 73 రైల్వేస్టేషన్లను ఆధునికీకరిస్తున్నారని, మరికొన్ని రైళ్లను ప్రవేశపెట్టబోతున్నారని చంద్రబాబు తెలిపారు.
ఈ సమావేశాల అనంతరం చంద్రబాబు దిల్లీలోని తన అధికార నివాసంలో ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలకు విందు ఇచ్చారు. ఎంపీల పనితీరును అడిగి తెలుసుకున్నారు. పార్లమెంట్లో హాజరు నుంచి సభలో జరిగే చర్చల్లో పాల్గొన్న విధానం, నిధులు రాబట్టడం, రాష్ట్ర సమస్యల పరిష్కారంలో చేస్తున్న కృషిని పరిశీలించి గ్రేడింగ్ ఇస్తామని చెప్పారు. ఏపీభవన్ అధికారులతో కలిసి సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.
Chandrababu Visit Delhi Updates : ప్రతి ఎంపీ తమ పార్లమెంట్ నియోజకవర్గంపై విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని చంద్రబాబు వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. రాష్ట్రానికి భవిష్యత్‌లో హైస్పీడ్ రైలు కారిడార్ వస్తుందని తెలిపారు. ప్రధాని మోదీ ఏపీ పట్ల చాలా సానుకూలతతో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇవాళ చంద్రబాబు కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, హర్‌దీప్‌సింగ్ పూరీని కలవనున్నారు. వరద సాయం, అమరావతి ఔటర్ రింగ్ రోడ్, జాతీయ రహదారుల అభివృద్ధి, విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం, రాష్ట్రంలో పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు, బడ్జెట్‌లో ప్రకటించిన పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిపై చర్చించనున్నారు.