CM Chandrababu Instructions to SPs: సంప్రదాయ నేరాలతో పాటు డిజిటల్ నేరాలను దర్యాప్తు చేసేందుకు బృందాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కొత్త తరహా నేరాలను ప్రత్యేకంగానే డీల్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసుల్లోనే సాంకేతిక నిపుణులు ఉండాలి లేదా బయటనుంచి నిపుణుల్ని కూడా తీసుకుని విచారణ చేయాల్సి ఉందని చెప్పారు. సామాజిక మాధ్యమాల నియంత్రణకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. నేరాల నియంత్రణ కోసం ఎస్పీలకు ఆయన కీలక సూచనలు చేశారు.
శాంతిభద్రతల అంశంపై కలెక్టర్ల సదస్సులో డీజీపీ ద్వారకా తిరుమల రావు ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలీసుల వ్యవస్థలో సాంకేతికత పెరగాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆ రకమైన చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా సీసీ కెమెరాలు, ఇతర సాంకేతిక సహకారంతో కేసుల దర్యాప్తు పూర్తి చేస్తున్నట్టు చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలను కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి కరడుకట్టిన నేరస్తుల్ని పట్టుకున్నామని తెలిపారు. సైబర్ సెక్యురిటీపై కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని వెల్లడించారు.
అదే సమయంలో రుణ యాప్‌లు ప్రజలను ఎలా బలి తీసుకుంటున్నాయో తెలియజేసే ఉదంతాన్ని మంత్రి లోకేశ్ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన సీఎం తగిన చర్యలు తీసుకుంటామన్నారు. లోన్ యాప్స్ అనేవి చైనా నుంచి ఆపరేట్ అవుతున్నాయని విజిలెన్స్ డీజీ హరీష్‌కుమార్ గుప్తా పేర్కొన్నారు. డేటా అంతా చైనాలోని సర్వర్లకు వెళ్లిపోతోందని హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. అక్కడి నుంచే ఈ యాప్ లను నిర్వహిస్తూ, స్థానికంగా ఏజెంట్ల ద్వారా నేరాలకు పాల్పడుతున్నట్టు స్పష్టం చేశారు. ఎన్ని యాప్‌లు ఉన్నాయన్నది, ఎంతమంది ఏజెంట్లు ఉన్నారన్న వివరాలు మనవద్ద లేవని వెల్లడించారు. దీనిపై స్పష్టమైన చట్టం తేవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
నేరగాళ్లది పైచేయి కాకుండా పోలీసులు పనిచేయాలి: పోలీసులు అసమర్థులైతే నేరగాళ్లదే పైచేయి అవుతుందన్న చంద్రబాబు, నేరాల నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్నవాటికంటే అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. రహదారులపై కొన్ని హాట్ స్పాట్ లలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని కూడా విశ్లేషించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకునేలా ఆ డేటా ఉపయోగించాలని దిశానిర్దేశం చేశారు.
నేరస్తులు రాజకీయ ముసుగులో బెదిరింపులకు దిగుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న పరిస్థితి ఉందని, బ్రహ్మకుమారీస్ లాంటి సంస్థలపై కూడా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని విమర్శించారు. సామాజిక మాధ్యమాల నియంత్రణకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
'ప్రతి మూడో శనివారం స్వచ్ఛాంధ్రప్రదేశ్ - రాష్ట్ర పునర్నిర్మాణంలో కలెక్టర్‌ల బాధ్యత కీలకం'
భూ ఆక్రమణలపై కఠినంగా ఉండాలి - ప్రజలు మెచ్చుకునేలా కలెక్టర్లు వ్యవహరించాలి : సీఎం చంద్రబాబు