CM Conducted Review on Formulation of New Energy Policy : దేశంలో ఒకవైపు విద్యుత్ అవసరాలు పెరుగుతుంటే సహజ వనరులు మాత్రం తరిగిపోతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఇందుకు సంప్రదాయేతర ఇంధన వనరులపై ఆధారపడటమే ఏకైక మార్గమని అభిప్రాయపడ్డారు. గతంలో తెలుగుదేశం హయాంలో సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిలో దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిచామని గుర్తు చేశారు. కానీ గత వైఎస్సార్సీపీ పాలనలో అనాలోచిత నిర్ణయాలతో ఇంధనశాఖ సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపించారు. మళ్లీ సంప్రదాయేతర ఇంధన వనరుల కేంద్రంగా ఏపీ మారాల్సిన తరుణం ఆసన్నమైందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
నూతన ఇందన పాలసీపై కసరత్తు : రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న నూతన ఇంధన పాలసీపై సమీక్షించిన చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తికి ఏపీలో అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. వాటిని సరిగ్గా వినియోగించుకుంటే సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద కేంద్రం అవుతుందన్నారు. రాష్ట్రంలో సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్, బయో ఎనర్జీకి ఉన్న అన్ని అవకాశాలు అందిపుచ్చుకునేలా కొత్త పాలసీ రూపొందించాలని సీఎం సూచించారు. పర్యావరణహితంతోపాటు తక్కువ ఖర్చుతో ఉత్పత్తి సాధించేలా ఇంధన పాలసీకి రూపకల్పన చేయాలని చంద్రబాబు తెలిపారు.
500 చోట్ల ఈవీ చార్జింగ్ స్టేషన్లు : ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన కొత్త సాంకేతిక విధానాలతోపాటు వివిధ దేశాలు, రాష్ట్రాల్లో సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి అనుసరిస్తున్న ఉత్తమ విధానాలపై అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. 2047 నాటికి కరెంట్ అవసరాలు, ఉత్పత్తిని మదింపు చేసి కొత్త పాలసీ సిద్ధం చేయాలన్నారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు తీసుకుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు. ఏపీలో కనీసం 500 చోట్ల ఈవీ చార్జింగ్ స్టేషన్లు పెట్టాలని తెలిపారు. ప్రజలు, సంస్థలు స్వయంగా సోలార్ విద్యుత్ ఉత్తత్తి చేసుకునేలా ప్రోత్సహించాలని చంద్రబాబు వివరించారు.
బ్రూక్ ఫీల్డ్ సంస్థ ప్రతినిధులతో సీఎం భేటీ : రాష్ట్రంలో లభించే క్వార్ట్జ్ ఖనిజం ద్వారా సోలార్ విద్యుత్ ప్యానెళ్లు తయారు చేస్తారని చంద్రబాబు తెలిపారు. ఈ కారణంగా సోలార్ ప్యానెళ్ల తయారీ పరిశ్రమలను ఏపీకి రప్పించే అంశంపైనా దృష్టిపెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రముఖ సౌర విద్యుత్ ప్యానెల్స్ తయారీ సంస్థ బ్రూక్ ఫీల్డ్ సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో రూఫ్ టాప్ సౌర విద్యుత్ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాలని వారిని చంద్రబాబు కోరారు.
విద్యుత్ అధికారులతో సీఎస్ భేటీ - సమస్యలపై ఫిర్యాదుకు 1912 టోల్ ఫ్రీ నెంబరు - CS Jawahar Reddy