CM Chandrababu Comments in Deepam 2 Programme : మహిళలు అన్ని వేళలా ఆత్మగౌరవంతో జీవించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజలు గెలవాలని, రాష్ట్రం నిలవాలని చెప్పిన విషయం తనకు గుర్తుందని తెలిపారు. కట్టెల పొయ్యితో మహిళలు పడిన బాధలు తననకు తెలుసని, దీపం పథకం కింద సిలిండర్ ఇచ్చి మహిళల కష్టాలు తీర్చానని అన్నారు. గ్యాస్ సిలిండర్‌కు మీరు కట్టిన డబ్బు 48 గంటల్లో రిఫండ్ అయ్యేలా చూస్తామని, సిలిండర్‌కు డబ్బు కట్టే పని లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నానని హామీ ఇచ్చారు. 64 లక్షల మందికి పింఛను ఇస్తున్న ప్రభుత్వం తమదని, అన్ని రాష్ట్రాల కంటే మనమే ఎక్కువ పింఛను ఇస్తున్నామని తెలిపారు.
ఆర్థిక సమస్యలు ఉన్నా పథకాలు అమలు చేస్తున్నామని, ప్రభుత్వం వద్ద డబ్బు లేదని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు అండగా ఉన్నామని, పింఛను మొత్తాన్ని 3 నెలలకు ఒకసారి కూడా తీసుకోవచ్చని అన్నారు. పింఛను ఎవరు ఆపినా నిలదీయండని, అది మీ హక్కు. పింఛను డబ్బును ఇంటి వద్దే గౌరవంగా ఇవ్వాలని ఆదేశించామని గుర్తు చేశారు. డ్వాక్రా సంఘాలకు మళ్లీ పూర్వ వైభవం తెస్తామని మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా మారుస్తామని హామీ ఇచ్చారు. దీపం 2.0లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో సీఎం చంద్రబాబు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రజా వేదికలో మాట్లాడారు.
ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ - స్వయంగా టీ కాచిన సీఎం చంద్రబాబు
అందరం కలిసి రాష్ట్రాన్ని కాపాడుకున్నాం : వైఎస్సార్సీపీ హయాంలో సభలకు ప్రజలను బలవంతంగా తరలించారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ నేతలు ప్రజాస్వామ్య హద్దులు దాటి ఇబ్బంది పెట్టారని, బాధ్యత గల ప్రజాప్రతినిధినని, తప్పు చేసిన వారిని వదిలిపెట్టనని అన్నారు. రాజకీయ కక్షసాధింపులకు పోనని తెలిపారు. నాయకుడు అంటే ప్రజల మనసుల్లో అభిమానం ఉండాలని, తనను అరెస్టు చేశాక తెలుగు ప్రజలంతా స్పందించారని, మొన్నటి ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు రాజీలేని పోరాటం చేశారని, అందరం కలిసి రాష్ట్రాన్ని కాపాడుకున్నామని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం సహకరించింది : ఉచితంగా ఇసుక ఇస్తున్న ఏకైక ప్రభుత్వమని, ఇసుక విషయంలో అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్టు కింద అరెస్టు చేస్తామని సీఎం హెచ్చరించారు. తమ హయాంలో నాసిరకం మద్యం ఉండదని, బెల్టు షాపులు ఉండవని, బెల్టు షాపులు పెడితే బెల్టు తీస్తానని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. పోలవరం కోసం రూ.990 కోట్లతో కొంత్త డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నామని, ఫేజ్-1 కింద కేంద్రం రూ.12,500 కోట్లు ఇచ్చిందని తెలిపారు. అమరావతిని మళ్లీ గాడిలో పెట్టామని, కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించిందని అన్నారు.
పలాసలో విమానాశ్రయం ఏర్పాటు : విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృధ్ధి చేస్తున్నామని, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడతామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు. ఇప్పటికే రెండు, మూడు సమావేశాలు జరిగాయని తెలిపారు. కేంద్రం డబ్బులు కూడా ఇచ్చిందని, రెండో ఫర్నేస్‌లో ఆపరేషన్ ప్రారంభమైందని వెల్లడించారు. విశాఖ రైల్వే జోన్‌కు లైన్ క్లియర్ చేశామని, రేపో ఎల్లుండో భూమి పూజ చేస్తామన్నారు టెక్కలి లేదా పలాసలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని, మూలపేటలో 10వేల ఎకరాల్లో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.