CM Chandra Babu Review on Higher Education System in AP : వర్సిటీలన్నీ ఒకే చట్టం కిందకు తీసుకురావాలనే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి పాఠ్యాంశాల మార్పుపై నిపుణులతో కమిటీ వేయాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్నత విద్యా విధానం గాడి తప్పిందన్న చంద్రబాబు రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకతతో వర్సిటీల్లో వీసీలను ఎంపిక చేయాలని తెలిపారు.
ఉన్నత విద్యపై సమీక్ష : సీఎం చంద్రబాబు సచివాలయంలో మంగళవారం ఉన్నత విద్యపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేశ్, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సౌరబ్‌గౌర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల ఖాళీలు, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించి న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడానికి కొత్త ప్రకటనలు ఇవ్వాలని సీఎం సూచించారు. అధ్యాపకులు లేకపోతే నాణ్యమైన విద్య అందించలేమని పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.
నిపుణులతో కమిటీ : రాష్ట్రంలో మొత్తం 48 ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, 2,061 కళాశాలలు ఉండగా 19.29 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని సీఎం వెల్లడించారు. అనేక సమస్యల వల్ల ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు పడిపోయాయని వ్యాఖ్యానించారు. వీటిని సరిదిద్ది జాతీయ, అంతర్జాతీయ స్థాయి ర్యాంకింగ్‌లు సాధించేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. మారుతున్న కాలానికి, డిమాండ్‌కు అనుగుణంగా కోర్సులు, కరికులం మార్చేందుకు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి, దేశ, విదేశాల్లో అధ్యయనం చేయాలని తెలిపారు. వీరిచ్చే నివేదిక ఆధారంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిలబస్‌లో మార్పులు చేయాలని ఆదేశించారు.
పారిశ్రామికవేత్తలకు సభ్యత్వం : ఈ సందర్భంలోనే వర్సిటీ స్నాతకోత్సవాలు ఘనంగా నిర్వహించాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. విద్యార్థుల సర్టిఫికెట్లను ఆధార్‌తో అనుసంధానం చేసి, డిజి లాకర్‌లో వాటిని నవంబరులోపు చేర్చాలని పిలుపునిచ్చారు. విదేశీ వర్సిటీల అనుసంధానంతో విద్యార్థులకు సంయుక్త డిగ్రీలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. బోర్డు ఆఫ్ గవర్నెన్స్ ఛైర్‌పర్సన్లుగా ప్రముఖ పారిశ్రామికవేత్తలను నియమించే విధానం పాటించాలని చంద్రబాబు సూచించారు. ఐఐఎం (IIM), ఐఐటీల్లో (IIT) ఈ విధానం అమల్లో ఉందని దాన్నే రాష్ట్ర వర్సిటీల్లో అమలు చేయాలని తెలిపారు.
ప్రభుత్వ వర్సిటీల బలోపేతం : రాష్ట్రంలో కెరీర్ కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఉన్నత విద్యను తిరిగి పట్టాలెక్కించి, మంచి ఫలితాలు సాధించేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాల బలోపేతంపై వెంటనే దృష్టిపెట్టాలని ఆదేశించారు. ప్రైవేటు, ప్రభుత్వ వర్సిటీలను బలోపేతం చేయడంతోపాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్దేశించారు. తద్వారా విద్యారంగంలో అవకాశాలు పెరుగుతాయన్నారు.
పారదర్శకతకు పెద్దపీట : గత ప్రభుత్వ అసమర్థ విధానాలు, ఉన్నత విద్యా రంగంపై చిన్నచూపు కారణంగా ఉన్నత విద్యా విభాగం గాడి తప్పిందని చంద్రబాబు మండిపడ్డారు. వర్సిటీలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చి, వాటి ప్రతిష్ఠను దెబ్బతీసిందని ధ్వజమెత్తారు. ఇప్పుడు సమూలంగా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకతకు పెద్దపీట వేసేలా ఉపకులపతుల ఎంపిక ఉండాలని ఆదేశించారు. విద్యా ప్రమాణాలతోపాటు ఇతర అంశాలతో వర్సిటీల ర్యాంకింగ్‌కు ఐదేళ్ల ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.
ఒకే చట్టం దిశగా అడుగులు : విశ్వవిద్యాలయాలకు సంబంధించి ప్రస్తుతం ఎనిమిది చట్టాలు అమల్లో ఉండగా వీటన్నింటినీ ఒకే చట్టం కిందకు తీసుకురావాలనే ప్రతిపాదనకు సీఎం అంగీకారం తెలిపారు. ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో కృత్రిమ మేధ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సీఎం నిర్ణయించారు. విజ్ఞాన అభివృద్ధి-విద్య, స్టార్టప్స్, పరిశోధన- అభివృద్ధి, గవర్నెన్స్- నైతికత వంటి అంశాల ప్రాతిపదికన ఈ వర్సిటీ ఏర్పాటు జరగాలన్నారు. రాజధాని నిర్మాణంలో నవనగరాల్లో భాగంగా అమరావతిలో ఏర్పాటు చేయదలచిన క్రీడా గ్రామం అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండేలా చూడాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కేజీ నుంచి పీజీ వరకు కరికులం మార్చాలని, అకాడమిక్ క్యాలండర్ ముందుగానే సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. స్థూల ప్రవేశాల నిష్పత్తి 36 శాతం ఉండగా 2029 నాటికి 60%కి తీసుకువెళ్లాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ సందర్భంగా సీఎంకు అధికారులు వివరించారు.
ఆ వైద్య కళాశాలలో సీట్లు ఇక లోకల్ విద్యార్థులకే- రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ జీవో - Dental College Seats