CID Investigation on ICICI Bank Fraud : పల్నాడు జిల్లా చిలకలూరిపేట, నరసరావుపేట ఐసీఐసీఐ బ్యాంక్ శాఖల్లో జరిగిన అక్రమాలపై సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్న బాధితులను మోసం చేసిన వ్యవహారంలో చిలకలూరిపేట బ్యాంకు సిబ్బందిని సీఐడీ అడినషల్ ఎస్పీ ఆదినారాయణ, సీఐడీ సీఐ సంజీవ్ కుమార్ ఆధ్వర్వంలో ఉదయం 11 గంటల నుంచి అధికారులు విచారించారు.
కఠిన చర్యలు తీసుకుంటాం : చిలకలూరిపేట, నరసరావుపేట ఐసీఐసీఐ బ్యాంక్ శాఖల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతున్నట్లు సీఐడీ అడిషనల్ ఎస్పీ ఆదినారాయణ తెలిపారు. ఈ రెండు శాఖలతో పాటు విజయవాడ బ్రాంచ్‌లో మేనేజర్‌గా పని చేసిన నరేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తి 72 మంది ఖాతాదారుల డబ్బు దారి మళ్లించినట్లు ఫిర్యాదు వచ్చిందన్నారు. మూడు శాఖల్లో కలిపి 28 కోట్ల రూపాయలు మాయమైనట్లు ఐసీఐసీఐ విజయవాడ జోనల్ మేనేజర్ దినేష్ మెహ్ర సీఐడీకి ఫిర్యాదు చేయడంతో చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంక్‌లో సిబ్బందిని, ఖాతాదారుల్ని విచారిస్తున్నట్లుపేర్కొన్నారు. నష్టపోయిన బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నామన్న అడిషనల్ ఎస్పీ సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు
నమ్మకంగా ఉంటూ నట్టేట ముంచిన బ్యాంకు మేనేజర్ - కోట్లలో స్వాహా
బ్యాంకు ముందు ఏఐఎస్ఎఫ్ నేతల ఆందోళన : ఖాతాదారుల ఎఫ్‌డీలు దారి మళ్లించడంలో ఉన్న పాత్ర, ఎంత మొత్తంలో నగదు దారి మళ్లించారనే విషయంపై ఆరా తీస్తున్నారు. బ్యాంకు తలుపులు మూసి, ఎవరూ లోపలికి రాకుండా బయటకు వెళ్లకుండా సీఐడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు బాధిత ఖాతాదారులకు న్యాయం చేయాలంటూ ఏఐఎస్ఎఫ్ నేతలు బ్యాంకు ముందు ఆందోళన చేశారు. మోసానికి పాల్పడిన బ్యాంకు సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారుల నగదు మాయం - రికార్డులు పరిశీలిస్తున్న అధికారులు
బ్యాంకులో నగదు, బంగారం లేదు : మోసపోయిన ఖాతాదారులకు చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అండగా నిలిచారు. బాధితులకు న్యాయం చేయాలని బ్యాంకు అధికారులను ఆయన కోరారు. బాధితులు 2 నెలలుగా ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ ఖాతాకు జమ కాకపోవడంతో ఇటీవల బ్యాంకుకు వెళ్లి నిలదీశారు. ఆ ఫిక్స్‌డ్ డిపాజిట్ల బాండ్లు చెల్లవని, అందులో నగదు, బంగారం లేదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మోసపోయామని గుర్తించి, పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఈ కేసును సీఐడీకి అప్పగించారు.
బ్యాంకు మేనేజర్ చేతివాటం- ఖాతాదారుల పేర్లు మీద లోన్లు, బంధువుల అకౌంట్లలోకి రూ3 కోట్లు